Honeymoon Murder Case: హనీమూన్ హత్య కేసులో కీలక మలుపు.. దొరికిన నగలు, ల్యాప్‌టాప్!

Honeymoon Murder Case Couples Jewellery Recovered From Madhya Pradesh
  • మృతుడు రాజా రఘువంశీ నగలు, వస్తువులు స్వాధీనం
  • మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో సొత్తును గుర్తించిన మేఘాలయ సిట్
  • సాక్ష్యాలు దాచిన ప్రాపర్టీ డీలర్ అత్తగారి ఇంట్లో సోదాలు
  • భార్య సోనమే ప్రధాన నిందితురాలిగా దర్యాప్తు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండోర్ జంట హనీమూన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హనీమూన్‌కు వెళ్లిన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన భార్య సోనమ్, ఆమె దోచుకున్న నగలు, ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో ఈ వస్తువులను మేఘాలయ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రికవరీ చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, అతని భార్య సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అక్కడ సోనమ్ తన ముగ్గురు స్నేహితుల‌తో కలిసి భర్తను హత్య చేసింది. మొదట వీరిద్దరూ కనపడటం లేదని కేసు నమోదు కాగా, దర్యాప్తులో ఇది హత్యగా తేలింది. ఈ కేసును విచారిస్తున్న మేఘాలయ సిట్ బృందం, సాక్ష్యాల ఆధారంగా మధ్యప్రదేశ్‌లో దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఇండోర్‌కు చెందిన ప్రాపర్టీ డీలర్ సిలోమ్ జేమ్స్ పాత్రపై పోలీసులకు అనుమానం కలిగింది.

హత్య తర్వాత నిందితుల్లో ఒకడైన విశాల్ సింగ్ చౌహాన్, జేమ్స్ అద్దెకు ఇచ్చిన ఫ్లాట్‌లో తలదాచుకున్నాడు. అంతేకాకుండా ప్రధాన నిందితురాలు సోనమ్ కూడా మే 26 నుంచి జూన్ 8 వరకు పోలీసులకు లొంగిపోయే ముందు వరకు ఇదే ఫ్లాట్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో జేమ్స్‌ను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఫ్లాట్ యజమాని లోకేంద్ర తోమర్, సెక్యూరిటీ గార్డ్ బల్వీర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో జేమ్స్ అసలు విషయం బయటపెట్టాడు. హత్య తర్వాత సోనమ్ నుంచి తీసుకున్న నగలు, మృతుడి ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్ వంటి వస్తువులను రత్లాంలో ఉన్న తన అత్తగారి ఇంట్లో దాచినట్లు అంగీకరించాడు. అతని సమాచారంతో సిట్ అధికారులు రత్లాంలోని ఆ ఇంటిపై దాడి చేసి నగలు, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్‌తో పాటు కొంత నగదు, నేరానికి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Honeymoon Murder Case
Sonam
Raja Raghuvanshi
Meghalaya
Indore
Ratlam
Silom James
Property dealer
Crime news

More Telugu News