Nellore District: నెల్లూరు జిల్లాలో దారుణం.. భార్యపై కోపం.. అడ్డువచ్చిన అత్తమామల హత్య

Nellore Double Murder Man Kills In Laws After Attacking Wife
  • నెల్లూరు జిల్లా దుత్తలూరులో దారుణ ఘటన
  • మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడికి యత్నం
  • అడ్డుకోబోయిన అత్తమామలపై కత్తితో దాడి 
  • దాడిలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి
  • తీవ్ర గాయాలతో భార్య ఆసుపత్రిలో, పరిస్థితి విషమం
  • నిందితుడు పరారీ, గాలిస్తున్న పోలీసులు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యపై దాడి చేయడమే కాకుండా అడ్డువచ్చిన అత్తామామలను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. ఈ దారుణ సంఘటన దుత్తలూరులోని ఎస్టీ కాలనీలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... ఎస్టీ కాలనీకి చెందిన ఏలూరి వెంగయ్య, అంకమ్మ భార్యాభర్తలు. మద్యం తాగిన వెంగయ్య, తన భార్య అంకమ్మతో గొడవపడ్డాడు. తీవ్ర ఆగ్రహంతో ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇది గమనించిన అంకమ్మ తల్లిదండ్రులైన కంజయ్య, జయమ్మ తమ కుమార్తెను కాపాడేందుకు అడ్డుగా వెళ్లారు. దీంతో వారిపై కూడా వెంగయ్య విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

కత్తిపోట్లకు గురైన కంజయ్య, జయమ్మ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అంకమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఆమెను వెంటనే ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు వెంగయ్య ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 
Nellore District
Eluri Vengaiah
Duttaluru
Double murder
ST Colony
Crime news
Andhra Pradesh crime
Udayagiri hospital

More Telugu News