Donald Trump: ఎలాన్ మస్క్ చాలా స్మార్ట్.. కానీ ఆ విషయంలో తప్పు చేశాడు: ట్రంప్

Donald Trump Praises Elon Musk Despite Tax Bill Dispute
  • మస్క్‌పై ప్రశంసలు కురిపించిన అమెరికా అధ్య‌క్షుడు
  • మస్క్ చాలా మంచి వ్యక్తి, తెలివైనవాడని వ్యాఖ్య
  • టాక్స్ బిల్లు విషయంలో ఇద్దరి మధ్య కొనసాగుతున్న విభేదాలు
  • ట్రంప్ బిల్లును తీవ్రంగా విమర్శించిన ఎలాన్ మస్క్
  • ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ రద్దే గొడవకు కారణమన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య పన్ను బిల్లు విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వివాదం నడుస్తుండగానే మస్క్‌పై ట్రంప్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మస్క్ ఒక 'అద్భుతమైన వ్యక్తి' అంటూ ప్రశంసించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆదివారం ఒక ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మస్క్‌తో ఏమైనా మాట్లాడారా అని విలేకరి ప్రశ్నించగా... "నేను ఆయనతో పెద్దగా మాట్లాడలేదు. కానీ ఎలాన్ ఒక అద్భుతమైన వ్యక్తి అని నేను భావిస్తున్నాను. ఆయన ఎప్పుడూ విజయం సాధిస్తారని నాకు తెలుసు. ఆయన చాలా తెలివైన వ్యక్తి. నాతో పాటు ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కానీ, ఆయన కాస్త అసంతృప్తికి గురయ్యారు. అది సరైనది కాదు" అని ట్రంప్ బదులిచ్చారు.

మస్క్‌తో విభేదాలకు దారితీసిన కారణాన్ని కూడా ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న పన్ను రాయితీని రద్దు చేయడంతోనే మస్క్ కలత చెందారని ఆయన పేర్కొన్నారు. "ఎలక్ట్రిక్ వాహనాల విధానం ఆయనకు కాస్త ఇబ్బందికరమైన విషయం. దేశంలో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ కారునే వాడాలని నేను కోరుకోవడం లేదు" అని ట్రంప్ వివరించారు. అయితే, ట్రంప్ చేస్తున్న ఈ ఆరోపణను మస్క్ గతంలోనే ఖండించడం గమనార్హం.

కాగా, శనివారం తన 54వ పుట్టినరోజు సందర్భంగా ఎలాన్ మస్క్, ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన పన్ను బిల్లుపై 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సుమారు 1000 పేజీలు ఉన్న ఈ బిల్లు ప్రతిపాదనను 'పూర్తిగా అవివేకమైనది, విధ్వంసకరమైనది' అని ఆయన అభివర్ణించారు. కాగా, మే వరకు మస్క్ 'డోగ్‌' (DOGE) అధిపతిగా, ట్రంప్‌కు అధ్యక్ష సలహాదారుగా పనిచేసిన విషయం తెలిసిందే. వైట్‌హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆయన ట్రంప్ విధానాలను బహిరంగంగా విమర్శించడం ప్రారంభించారు.
Donald Trump
Elon Musk
Tesla
tax bill
electric vehicles
politics
X platform
DOGE
Trump administration
business

More Telugu News