Chandrababu Naidu: టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు డుమ్మా .. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu Angered by 15 MLAs Absent from TDP Meeting
  • పార్టీ కార్యక్రమాల కంటే ఇతర పనులు ముఖ్యమా అని నేతలను నిలదీసిన సీఎం చంద్రబాబు
  • ఎమ్మెల్యేల గైర్హాజరుపై చంద్రబాబు ఆగ్రహం
  • తరచు విదేశీ పర్యటనలు పెట్టుకునే వారు ఇక ఫారిన్ లోనే ఉండటం మంచిదంటూ చురకలు
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీనిపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్తృత స్థాయి సమావేశం ముగింపు సందర్భంగా ప్రజా ప్రతినిధులు, నేతలు హాజరు కాకపోవడంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీ కార్యక్రమాలకంటే ఇతర పనులు ముఖ్యమా అంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి రాని 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం సీరియస్ అయ్యారు. తానా, ఆటాలకు టికెట్లు బుక్ చేసుకున్న వారి జాబితా కూడా తన వద్ద ఉందని సీఎం అన్నారు. తరచుగా విదేశీ పర్యటనలు పెట్టుకునే వారు ఇకపై అక్కడే ఉండటం మంచిదని హితవు పలికారు.

సమావేశానికి గైర్హాజరు కావడానికి కారణాలు అడిగితే కొందరు విదేశీ పర్యటనలని, మరికొందరు దైవ దర్శనాలు అని సమాధానం ఇచ్చారని చంద్రబాబు అన్నారు. ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని హితవు పలికారు. ఆహ్వానితుల్లో 56 మంది హాజరు కాలేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంత మంది వచ్చారు? సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారు? సమావేశం చివరి వరకూ ఎంత మంది ఉన్నారో అందరి లెక్కలు తన వద్ద ఉన్నాయని హెచ్చరించారు.

ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు బాధ్యతారహితంగా ఉన్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగింది. 
Chandrababu Naidu
TDP
Telugu Desam Party
AP Politics
MLA Absent
Party Meeting
Andhra Pradesh
TANA
AATA

More Telugu News