Manjinder Singh Sirsa: ఢిల్లీ కాలుష్యంపై యుద్ధం.. కృత్రిమ వర్షానికి రంగం సిద్ధం

Artificial Rain in Delhi to Combat Pollution Says Minister Manjinder Singh Sirsa
  • ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు కృత్రిమ వర్షం
  • వాతావరణం అనుకూలిస్తే జులై 4 నుంచి 11 మధ్య ప్రయోగం
  • ఐఐటీ కాన్పూర్ సాంకేతిక సహకారంతో ఏర్పాట్లు పూర్తి
  • ఆప్ విమర్శలను తిప్పికొట్టిన పర్యావరణ మంత్రి సిర్సా
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలో తొలిసారిగా కృత్రిమ వర్షం (క్లౌడ్ సీడింగ్) కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జులై 4 నుంచి 11వ తేదీ మధ్య ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం వెల్లడించారు.

ఈ ప్రయోగానికి సంబంధించిన విమాన ప్రణాళికను ఐఐటీ కాన్పూర్ రూపొందించి, సాంకేతిక సమన్వయం కోసం పూణెలోని భారత వాతావరణ విభాగానికి (ఐఎండీ) సమర్పించిందని మంత్రి తెలిపారు. "జులై 3 వరకు క్లౌడ్ సీడింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే జులై 4 నుంచి 11 మధ్య ప్రయోగానికి ఒక విండోను ప్రతిపాదించాం" అని ఆయన వివరించారు. ఒకవేళ ఈ తేదీల్లో వాతావరణం అనుకూలించకపోతే ప్రయోగాన్ని తరువాత తేదీలో నిర్వహించేందుకు వీలుగా మరో ప్రత్యామ్నాయ విండోను కేటాయించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు ప్రతిపాదన పంపినట్టు సిర్సా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేఖా గుప్తా నాయకత్వంలో పర్యావరణ శాఖ ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని చేపడుతోందని సిర్సా అన్నారు. "ఢిల్లీ వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించడమే మా లక్ష్యం. ఇది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. దీనికోసం మేము అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. అందుకే కృత్రిమ వర్షం లాంటి సాహసోపేతమైన అడుగు వేస్తున్నాం. ఇది కచ్చితంగా మార్పు తెస్తుందని ఆశిస్తున్నాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆప్ విమర్శలపై మంత్రి స్పందన
గతంలో కృత్రిమ వర్షం ప్రతిపాదనను బీజేపీ ఎగతాళి చేసిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ ప్రయోగం చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ చేసిన విమర్శలపై మంత్రి సిర్సా ఘాటుగా స్పందించారు. "కృత్రిమ వర్షం కోసం మొదట ఒప్పందంపై సంతకాలు చేసింది మేమే. ఐఐటీ కాన్పూర్‌కు అవసరమైన నిధులు చెల్లించి, అనుమతుల కోసం దరఖాస్తు చేసింది కూడా మేమే. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది" అని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ ప్రయోగానికి తేదీ ఖరారు చేసే స్థాయికి వచ్చామని సిర్సా తెలిపారు.

ప్రయోగం ఇలా..
‘ఢిల్లీ ఎన్‌సీఆర్ కాలుష్య నివారణకు ప్రత్యామ్నాయంగా క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ప్రదర్శన, మూల్యాంకనం' పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా వాయవ్య, ఔటర్ ఢిల్లీలోని లో-సెక్యూరిటీ ఎయిర్ జోన్లలో ఐదు విమానాలతో ప్రయోగాలు నిర్వహిస్తారు. సెస్నా విమానాలకు మార్పులు చేసి, వాటి ద్వారా మేఘాలపై రసాయన మిశ్రమాన్ని చల్లుతారు. ప్రతి విమానం సుమారు 90 నిమిషాల పాటు గాలిలో ఉండి, 100 చదరపు కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన ఈ మిశ్రమంలో సిల్వర్ అయోడైడ్ నానోపార్టికల్స్, అయోడైజ్డ్ ఉప్పు, రాక్ సాల్ట్ ఉంటాయి. ఈ మిశ్రమాన్ని తేమతో నిండిన మేఘాలపై చల్లడం ద్వారా నీటి బిందువులు త్వరగా ఏర్పడి, కృత్రిమ వర్షం కురుస్తుంది.
Manjinder Singh Sirsa
Delhi pollution
artificial rain
cloud seeding
IIT Kanpur
Rekha Gupta
Saurabh Bharadwaj
air quality Delhi
DGCA
environment

More Telugu News