AB de Villiers: బుమ్రాకు విశ్రాంతి.. గంభీర్ వ్యూహాన్ని తప్పుబట్టిన ఏబీ డివిలియర్స్

AB de Villiers Slams Mismanagement As Gautam Gambhir Restricts Jasprit Bumrah To 3 Tests
  • ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో 3 మ్యాచులకే బుమ్రా పరిమితం
  • టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు
  • భారత జట్టు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఏబీ డివిలియర్స్
  • ఇది సరైన వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కాదని, యాజమాన్య లోపం కావచ్చని వ్యాఖ్య
  • కీలక టెస్టులకు బదులు చిన్న సిరీస్‌లలో విశ్రాంతి ఇవ్వాలని సూచన
భారత జట్టులో అత్యంత కీలకమైన పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారత జట్టుకు అత్యంత కఠినమైనదిగా భావించే ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌కు గాను బుమ్రాను కేవలం మూడు మ్యాచులకే పరిమితం చేయాలన్న టీమిండియా నిర్ణయంపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత జట్టు యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున దాదాపు అన్ని మ్యాచులూ ఆడిన బుమ్రాకు, అత్యంత కీలకమైన టెస్ట్ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ నిర్ణయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, ఈ వ్యూహాన్ని ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు.

ఈ విషయంపై తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన డివిలియర్స్... "ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. అలాంటి బౌలర్‌కు ఎలా విశ్రాంతి ఇవ్వాలనేది చాలా కష్టమైన నిర్ణయం. కానీ నా అభిప్రాయం ప్రకారం టెస్ట్ క్రికెట్టే అసలైన ఫార్మాట్. బహుశా ఈ టెస్ట్ సిరీస్‌లోని ఐదు మ్యాచులకు అతడిని సిద్ధం చేయాల్సింది" అని అన్నాడు.

గతంలో తమ జట్టు స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ విషయంలో అనుసరించిన విధానాన్ని డివిలియర్స్ గుర్తుచేశాడు. "మేము డేల్ స్టెయిన్ విషయంలో సరిగ్గా ఇదే చేసేవాళ్లం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ వంటి కీలక పర్యటనలకు ముందు తక్కువ ప్రాధాన్యత ఉన్న టీ20, వన్డే సిరీస్‌లలో అతనికి విశ్రాంతి ఇచ్చేవాళ్లం. తద్వారా అతను పెద్ద టెస్ట్ సిరీస్‌లకు పూర్తి ఉత్సాహంతో సిద్ధమయ్యేవాడు" అని వివరించాడు.

భారత జట్టు యాజమాన్యం తీరును ప్రశ్నిస్తూ, ఇది ఒకరకంగా 'మిస్‌మేనేజ్‌మెంట్' కావచ్చని ఏబీడీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "ఇది యాజమాన్య లోపమా? లేక ఇటీవల గాయం నుంచి కోలుకున్న బుమ్రాను ఐపీఎల్‌ను ఒక వార్మప్ దశగా భావించారా? అనేది నాకు తెలియదు. బహుశా సర్జన్ అతనికి ఐదు టెస్టులు ఆడలేవని ఏమైనా సలహా ఇచ్చి ఉండవచ్చు. అదే నిజమైతే మనం దాన్ని గౌరవించాలి. అతడిని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత టీమిండియాదే" అని ఆయన పేర్కొన్నాడు.
AB de Villiers
Jasprit Bumrah
Bumrah workload
Gautam Gambhir
Dale Steyn
India vs England
Test Series
Cricket
Workload Management
Indian Cricket Team

More Telugu News