Ridhanya: వోల్వో కారు.. 800 గ్రాముల బంగారం ఇచ్చినా అదనపు కట్నం కోసం వేధింపులు.. నవ వధువు ఆత్మహత్య

Dowry Harassment Drives Ridhanya to Suicide After Volvo Car Gift
  • కారులో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న నవ వధువు
  • చనిపోయే ముందు తండ్రికి వాట్సాప్‌లో ఏడు ఆడియో సందేశాలు
  • భర్త, అత్తమామల వేధింపులు భరించలేకనే ఈ నిర్ణయమన్న యువతి
  • భర్త సహా అత్తమామలను అరెస్ట్ చేసిన పోలీసులు
కట్నం వేధింపులు మరో నవవధువు జీవితాన్ని బలిగొన్నాయి. పెళ్లయిన రెండు నెలలకే అత్తింటి వేధింపులు భరించలేక ఓ యువతి కారులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తండ్రికి వాట్సాప్‌లో పంపిన ఆడియో సందేశాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుప్పూర్‌కు చెందిన వస్త్ర వ్యాపారి అన్నాదురై కుమార్తె రిధన్య (27)కు, కవిన్‌కుమార్ (28) అనే యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రిధన్య తల్లిదండ్రులు 100 సవర్ల (800 గ్రాములు) బంగారం, రూ.70 లక్షలు విలువ చేసే వోల్వో కారును కట్నంగా ఇచ్చారు. అయినా, అదనపు కట్నం కోసం భర్త కవిన్‌కుమార్, అత్తమామలు ఈశ్వరమూర్తి, చిత్రదేవి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టినట్టు ఆరోపణలున్నాయి.

ఆదివారం మొండిపాలయంలోని ఆలయానికి వెళ్తున్నానని చెప్పి రిధన్య ఇంట్లో నుంచి కారులో బయలుదేరింది. మార్గమధ్యలో కారును పక్కకు ఆపి, అందులోనే పురుగుల మందు తాగింది. చాలా సేపటి నుంచి కారు ఒకేచోట ఆగి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో చూడగా, నోటి నుంచి నురగలు కక్కుతూ రిధన్య అప్పటికే మృతి చెంది ఉంది.

ఆత్మహత్యకు ముందు రిధన్య తన తండ్రికి వాట్సాప్‌లో ఏడు ఆడియో సందేశాలు పంపింది. అందులో తన ఆవేదనను వెళ్లగక్కింది. "నన్ను పెళ్లి చేసుకోవాలని వాళ్లు ముందే పథకం వేశారు. రోజూ వాళ్లు పెట్టే మానసిక హింసను నేను భరించలేకపోతున్నాను. ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. ఎవరైనా సర్దుకుపోవాలనే చెబుతున్నారు కానీ, నా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

"ఈ జీవితాంతం మీకు భారం కావాలని లేదు. దయచేసి నన్ను క్షమించండి నాన్న. ఈ జీవితం నాకు నచ్చలేదు. వాళ్లు నన్ను మానసికంగా హింసిస్తుంటే, అతను శారీరకంగా హింసిస్తున్నాడు. ఇక నేను బతకలేను. అమ్మానాన్నలే నా ప్రపంచం. చివరి శ్వాస వరకూ మీరే నా ధైర్యం. కానీ మిమ్మల్ని చాలా బాధపెట్టాను. అంతా అయిపోయింది నాన్న, నేను వెళ్లిపోతున్నాను" అని ఆమె తన చివరి సందేశంలో పేర్కొంది.

రిధన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని ఆమె బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రిధన్య భర్త కవిన్‌కుమార్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రదేవిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Ridhanya
Dowry harassment
Suicide
Tamil Nadu
Volvo car
অতিরিক্ত যৌতুক
Husband
In-laws
WhatsApp audio
Tiruppur

More Telugu News