Narasimha Bhol: నిరసనకారుల కాళ్లు విరగ్గొడితే రివార్డు.. పోలీసు అధికారి వివాదాస్పద ఆదేశాలు!

Narasimha Bhol Orders to Break Protestors Legs Sparks Controversy
  • ఒడిశా సీఎం ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
  • ఆందోళనకారుల కాళ్లు విరగ్గొట్టాలని సిబ్బందికి పోలీసు అధికారి ఆదేశం
  • కాలు విరగ్గొట్టిన వారికి బహుమతి ఇస్తానని ప్రకటన
  • పూరీ రథయాత్ర తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ ఆందోళన
  • వివాదంపై స్పందించిన ఏసీపీ.. తన మాటలను వక్రీకరించారని వివరణ
ఒడిశాలో ఓ సీనియర్ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి నివాసం వద్ద నిరసన తెలుపుతున్న ఆందోళనకారుల ‘కాళ్లు విరగ్గొట్టండి’ అంటూ ఆయన తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు అధికారి స్పందించారు. తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు.

అసలేం జరిగింది?
ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రద్దీని నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నివాసం సమీపంలో సోమవారం నిరసనకు దిగారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఓ పోలీసు అధికారి, ఆందోళనకారులను అడ్డుకోవాలని తన సిబ్బందికి సూచిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

అధికారి ఏమన్నారు?
వైరల్ అయిన వీడియోలో భువనేశ్వర్ అదనపు పోలీసు కమిషనర్ (ఏసీపీ) నరసింహ భోల్ తన సిబ్బందితో మాట్లాడుతూ.. "ఎవరైనా ఇక్కడికి వస్తే కాళ్లు విరగ్గొట్టండి. వాళ్లను పట్టుకోవద్దు, కేవలం కాళ్లు విరగ్గొట్టండి చాలు. వారిని పట్టుకోవడానికి మేం కొంచెం దూరంలో ఉన్నాం. ఎవరైతే కాలు విరగ్గొడతారో, నా దగ్గరికి వచ్చి బహుమతి తీసుకోండి" అని చెప్పడం స్పష్టంగా వినిపించింది. బారికేడ్ల వద్ద ఉన్న పోలీసులకు ఆయన ఈ రకమైన ఆదేశాలు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

వివాదంపై ఏసీపీ వివరణ
ఈ వీడియోపై దుమారం చెలరేగడంతో ఏసీపీ నరసింహ భోల్ స్పందించారు. తన మాటలను వక్రీకరించారని, పూర్తి సందర్భాన్ని చూడకుండా కేవలం కొన్ని మాటలను మాత్రమే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. "ప్రతిదానికీ ఒక సమయం, సందర్భం ఉంటాయి. ఆ వీడియోను పూర్తిగా చూస్తే, నిరసనకారులను అరెస్టు చేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని సిబ్బందికి చెబుతున్న విషయం అర్థమవుతుంది" అని ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు తెలిపారు.

ఆందోళనకారులు మొదటి బారికేడ్ వద్దకే పరిమితం కావాలని, ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి రెండు బారికేడ్లను దాటి వస్తే, వారు చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని ఆయన వివరించారు. "చట్టవిరుద్ధంగా గుమిగూడిన వారిని నిలువరించడానికి గరిష్ఠ స్థాయిలో బలప్రయోగం చేసే అధికారం మాకు ఉంది. ఆ సందర్భంలోనే నేను ఆ మాటలు అనాల్సి వచ్చింది" అని ఏసీపీ భోల్ స్పష్టం చేశారు. 
Narasimha Bhol
Odisha
Puri Jagannath Rath Yatra
Congress Party
Mohan Charan Majhi
Bhubaneswar Police
Protest
Police Officer Controversy
Crowd Control
Law and Order

More Telugu News