Stateviewer: ఒకే ఒక్క స్కాన్‌తో 9 రకాల డిమెన్షియాలకు చెక్.. అమెరికా పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ!

Stateviewer AI Tool Detects 9 Types of Dementia with Single Scan
  • డిమెన్షియా గుర్తింపులో సరికొత్త ఏఐ టూల్ ఆవిష్కరణ
  • 'స్టేట్‌వ్యూయర్' పేరుతో అమెరికా మేయో క్లినిక్ పరిశోధకుల ఘనత
  • 88 శాతం కచ్చితత్వంతో వ్యాధి రకాన్ని గుర్తిస్తున్న టూల్
  • వైద్యులకు రెట్టింపు వేగం, మూడింతల కచ్చితత్వంతో ఫలితాలు
  • అల్జీమర్స్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు మార్గం
వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అల్జీమర్స్ వంటి మతిమరుపు వ్యాధులను (డిమెన్షియా) అత్యంత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు అమెరికా పరిశోధకులు ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌ను అభివృద్ధి చేశారు. 'స్టేట్‌వ్యూయర్' అని పిలిచే ఈ టూల్, కేవలం ఒకే ఒక్క స్కాన్ సహాయంతో ఏకంగా తొమ్మిది రకాల డిమెన్షియాలను గుర్తించగలదు. ఇది మెదడు పనితీరును దెబ్బతీసే వ్యాధుల (న్యూరోడిజనరేటివ్) నిర్ధారణలో ఒక విప్లవాత్మక ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

 88 శాతం కచ్చితత్వంతో నిర్ధారణ

అమెరికాలోని ప్రఖ్యాత మేయో క్లినిక్‌కు చెందిన పరిశోధకులు ఈ ఏఐ టూల్‌ను రూపొందించారు. ఈ టూల్ పనితీరు అమోఘమని, సుమారు 88 శాతం కేసులలో ఏ రకమైన డెమెన్షియానో కచ్చితంగా చెప్పగలిగిందని వారు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుతం వైద్యులు అనుసరిస్తున్న పద్ధతులతో పోలిస్తే, ఈ టూల్ సహాయంతో మెదడు స్కానింగ్‌లను రెట్టింపు వేగంతో విశ్లేషించవచ్చని, రోగ నిర్ధారణలో కచ్చితత్వం మూడు రెట్లు పెరిగిందని వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలను ప్రఖ్యాత 'న్యూరాలజీ' జర్నల్‌లో ప్రచురించారు.

'స్టేట్‌వ్యూయర్' పనిచేసే విధానం
సాధారణంగా అందుబాటులో ఉండే ఫ్లోరోడీఆక్సీగ్లూకోజ్ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (ఎఫ్‌డీజీ-పీఈటీ) స్కాన్‌ను ఈ ఏఐ టూల్ విశ్లేషిస్తుంది. ఈ స్కాన్ ద్వారా మెదడు శక్తి కోసం గ్లూకోజ్‌ను ఎలా వినియోగించుకుంటుందో తెలుసుకోవచ్చు. 'స్టేట్‌వ్యూయర్', రోగి స్కాన్‌ను దాదాపు 3,600కు పైగా ధ్రువీకరించబడిన స్కాన్‌ల డేటాబేస్‌తో పోల్చి చూస్తుంది. ఈ డేటాబేస్‌లో వివిధ రకాల డెమెన్షియా రోగుల స్కాన్‌లతో పాటు, ఆరోగ్యవంతుల స్కాన్‌లు కూడా ఉంటాయి. తద్వారా, ఏ రకమైన డిమెన్షియాకు సంబంధించిన నమూనాలు రోగి మెదడులో ఉన్నాయో ఇది గుర్తిస్తుంది.

అల్జీమర్స్ వ్యాధి మెదడులోని జ్ఞాపకశక్తి, సమాచార ప్రాసెసింగ్ ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది. లూయీ బాడీ డిమెన్షియా ఏకాగ్రత, కదలికలకు సంబంధించిన భాగాలను దెబ్బతీస్తుంది. ఈ తేడాలను ఏఐ కచ్చితంగా పసిగడుతుంది. విశ్లేషణ అనంతరం, కలర్-కోడెడ్ బ్రెయిన్ మ్యాప్‌ల రూపంలో ఫలితాలను అందిస్తుంది. దీనివల్ల న్యూరాలజీలో ప్రత్యేక శిక్షణ లేని వైద్యులు కూడా ఏఐ అందించిన రోగ నిర్ధారణను సులభంగా అర్థం చేసుకోవచ్చు.

వ్యాధి నిర్ధారణలో కొత్త ఆశలు
ప్రస్తుతం డిమెన్షియాను గుర్తించాలంటే క్లిష్టమైన కాగ్నిటివ్ పరీక్షలు, రక్త పరీక్షలు, ఇమేజింగ్, రోగితో సుదీర్ఘ సంభాషణలు అవసరం. అయినప్పటికీ అల్జీమర్స్, లూయీ బాడీ డిమెన్షియా, ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా వంటి వ్యాధుల మధ్య తేడాను గుర్తించడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో 'స్టేట్‌వ్యూయర్' ఒక గొప్ప ముందడుగు అని మేయో క్లినిక్ న్యూరాలజిస్ట్, ఏఐ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ జోన్స్ అన్నారు. "నా దగ్గరకు వచ్చే ప్రతి రోగిదీ ఒక ప్రత్యేకమైన కథ. ఈ టూల్ ద్వారా వ్యాధిని ముందుగానే అర్థం చేసుకుని, కచ్చితమైన చికిత్స అందించే దిశగా పయనిస్తున్నాం. భవిష్యత్తులో ఈ వ్యాధుల గమనాన్ని మార్చగలమనే నమ్మకం ఉంది" అని ఆయన వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల మందికి పైగా డిమెన్షియాతో బాధపడుతుండగా ఏటా కోటి కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇందులో అత్యంత సాధారణమైన అల్జీమర్స్, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ఐదో ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో 'స్టేట్‌వ్యూయర్' వంటి సాంకేతిక ఆవిష్కరణలు లక్షలాది మంది జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి.
Stateviewer
Dementia
Alzheimer's
Mayo Clinic
Artificial Intelligence
AI Tool
Neurodegenerative diseases
FDG-PET Scan
David Jones
Brain Scan

More Telugu News