Dead body In Garbage Truck: చెత్త లారీలో మహిళ మృతదేహం.. సహజీవన భాగస్వామే హంతకుడు!

Man Kills Live in Partner Dumps Body in Garbage Truck In Bengaluru
  • బెంగళూరులో మహిళ దారుణ హత్య
  • సహజీవనం చేస్తున్న ప్రియుడే హంతకుడని పోలీసుల నిర్ధారణ
  • ఇద్దరికీ వేర్వేరుగా వివాహాలు, పిల్లలు ఉన్నట్లు వెల్లడి
  • సీసీటీవీ ఆధారంగా అసోం వాసి అరెస్ట్
బెంగళూరు నగరంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గోనె సంచిలో కుక్కి చెత్త లారీలో పడేసిన స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఆమెతో సహజీవనం చేస్తున్న ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చి, నిందితుడిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఆదివారం బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) సిబ్బందికి చెత్త లారీలో ఓ గోనె సంచి అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని తెరిచి చూడగా, చేతులు కట్టేసి ఉన్న మహిళ మృతదేహం బయటపడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని అసోంకు చెందిన మహమ్మద్ షంషుద్దీన్ (33)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మృతురాలిని ఆశ (40)గా గుర్తించారు. ఏడాదిన్నరగా వీరిద్దరూ దక్షిణ బెంగళూరులోని హుళిమావు ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికీ అప్పటికే వేర్వేరుగా వివాహాలై, ఇద్దరేసి పిల్లలు కూడా ఉన్నారు. అయితే, స్థానికంగా మాత్రం తాము భార్యాభర్తలమని చెప్పుకుని జీవిస్తున్నారు.

వితంతువైన ఆశ, అర్బన్ కంపెనీలో హౌస్‌కీపింగ్ సేవలు అందిస్తూ జీవనం సాగిస్తోంది. పోలీసుల విచారణ ప్రకారం, ఇద్దరి మధ్య జరిగిన ఓ గొడవ తీవ్రరూపం దాల్చడంతో షంషుద్దీన్ ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి, బైక్‌పై తీసుకెళ్లి చెత్త లారీలో పడేసి పారిపోయినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లోకేశ్ బి జగలసర్ తెలిపారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో నిందితుడిని పట్టుకోవడం సులువైందని చెప్పారు.
Dead body In Garbage Truck
Live-in partner murder
Mohammed Shamsuddin
Bengaluru crime
Asha murder case
Hulimavu
BBMP
Garbage truck
Crime news
Domestic violence
Karnataka police

More Telugu News