Sekhar Kammula: ఆ టెస్ట్ పాసవ్వడమే నాకు పెద్ద గెలుపు.. ‘కుబేర’ విజయంపై శేఖర్ కమ్ముల

Sekhar Kammula on Kubera Success Overcoming Challenges
  • రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ‘కుబేర’ చిత్రం
  • నేటి తరానికి కథ రాయడమే పెద్ద సవాల్ అన్న శేఖర్ కమ్ముల
  • సోషల్ మీడియా వల్ల పిల్లలకు అన్నీ ముందే తెలుస్తున్నాయని వ్యాఖ్య
  • నిడివి కారణంగా చాలా కథను తగ్గించాల్సి వచ్చిందని వెల్లడి
  • చెన్నైలో ధనుశ్‌తో సినిమా చూడటం గొప్ప అనుభవం అన్న డైరెక్ట‌ర్‌
సున్నితమైన చిత్రాలకు చిరునామాగా నిలిచే దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘కుబేర’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన విష‌యం తెలిసిందే. రూ.100 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూవీ గురించి ప‌లు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా విజయం కంటే, నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా కథను సిద్ధం చేయడమే తనకు అతిపెద్ద సవాలుగా నిలిచిందన్నారు. ఆ పరీక్షలో నెగ్గడమే అసలైన విజయంగా భావిస్తున్నానని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.

నేటి తరానికి కథ రాయడం కత్తి మీద సాము
ప్రస్తుత తరం ఆలోచనలకు అనుగుణంగా కథ రాయడంపై శేఖర్ కమ్ముల తన అభిప్రాయాలను పంచుకున్నారు. "గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఒకప్పుడు 20 ఏళ్లకు తెలిసే విషయాలు ఇప్పుడు పదేళ్లకే తెలిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి తరానికి నచ్చే కథను నేను రాయగలనా అనే సందేహం నాలో కలిగింది. ‘కుబేర’ విషయంలో ఆ పరీక్షను దాటడమే నాకు పెద్ద విజయంగా అనిపించింది" అని ఆయన వివరించారు. 

ఈ సినిమా ఒక సాధారణ ప్రేమకథ కాదని, ఇందులో ప్రత్యేకంగా లవ్ సాంగ్స్ కూడా లేవని గుర్తుచేశారు. ఒక స్టార్ హీరో, మరోవైపు ఓ బిచ్చగాడి జీవితం వంటి విభిన్నమైన అంశాలను కలిపి ప్రేక్షకులను మెప్పించేలా కథను సిద్ధం చేశానని, ఈ క్రమంలో ఎన్నో పరీక్షలను దాటానని తెలిపారు.

నిడివి కారణంగా కథను కుదించాల్సి వచ్చింది
ఈ చిత్రంలో ఇంకా చెప్పాల్సిన కథ చాలా ఉందని, కానీ నిడివి సమస్య కారణంగా తగ్గించాల్సి వచ్చిందని శేఖర్ కమ్ముల వెల్లడించారు. "సినిమా అంటే 2 గంటల 45 నిమిషాలు ఉండాలనే భావనలో ప్రేక్షకులు స్థిరపడిపోయారు. దానికి కొంచెం ఎక్కువైనా నిడివి ఎక్కువైందనిపిస్తోంది. అందుకే ‘కుబేర’ కథను మరింత ట్రిమ్ చేద్దామని ప్రయత్నించాను. కానీ, కథాగమనానికి ఎక్కడా ఆస్కారం లభించలేదు" అని ఆయన పేర్కొన్నారు.

ఇక‌, సినిమా విడుదలకు ముందు తాను, తన బృందం తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యామని ఆయన తెలిపారు. "ఈ సినిమా కోసం చిత్ర బృందం మొత్తం ఎంతో కష్టపడింది. చెన్నైలో నటుడు ధనుశ్‌తో కలిసి ఈ సినిమా చూడటం నాకు గొప్ప అనుభవంగా మిగిలిపోతుంది" అని శేఖర్ కమ్ముల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Sekhar Kammula
Kubera movie
Dhanush
Telugu cinema
Box office success
Movie review
Film director
Tollywood
Latest movie news
Kubera collections

More Telugu News