Nara Lokesh: ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై నారా లోకేశ్ ప్రశంసలు

Nara Lokesh Praises Government Teacher for Enrolling Children in Public School
  • ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు వాసుదేవరావు
  • ప్రజల్లో ఆలోచన రేకెత్తించారని లోకేశ్ ప్రశంస
  • విద్యా వ్యవస్థలో సంస్కరణల ఫలితమని వ్యాఖ్య
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ఆ ఉపాధ్యాయుడికి అభినందనలు తెలిపారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం పడిన శ్రమను మరిచిపోవచ్చని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే, రాజాం నియోజకవర్గం డోలపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు డోల వాసుదేవరావు, తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి లోకేశ్ వాసుదేవరావు లాంటి వారిని చూసినప్పుడు తాను కోరుకున్న మార్పు ఇదేనని అనిపిస్తోందని అన్నారు. రాజకీయాలకు దూరంగా, సమగ్ర విద్యకు దగ్గరగా పాఠశాలలను తీర్చిదిద్దేందుకు పడిన కష్టానికి ఫలితం దక్కుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

"ప్రభుత్వ పాఠశాలల ముందు 'నో అడ్మిషన్' బోర్డులు చూడాలన్నదే నా ఆకాంక్ష. ఒక ఉపాధ్యాయుడే తన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పిస్తున్నప్పుడు, ఇతరులు ఎందుకు చదివించకూడదు అనే ఆలోచన ప్రజల్లో రేకెత్తించిన వాసు మాస్టర్‌కు నా అభినందనలు" అని లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు, సమస్యల పరిష్కారానికి ఇది నిదర్శనమని ఆయన తెలిపారు.

అంతేకాకుండా, "మన బడికి మనమే అంబాసిడర్స్‌గా నిలుద్దాం. అందరం కలిసి మన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిచే 'ఏపీ మోడల్ ఎడ్యుకేషన్' కేంద్రంగా తీర్చిదిద్దుదాం" అని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుడి చర్య ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
Nara Lokesh
AP Model Education
Government Teacher
Dola Vasudeva Rao
Andhra Pradesh Education
Government Schools
Education Reform
Rajah Constituency
AP Education System
Telugu News

More Telugu News