Siddaramaiah: కర్ణాటక సీఎం మార్పు ప్రచారంపై కాంగ్రెస్ క్లారిటీ ఇదే..!

Siddaramaiah to Remain Karnataka CM Congress Clarifies
  • ఐదేళ్లూ సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అని స్పష్టం చేసిన సీనియర్ నేత
  • నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు తెర
  • సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాల ప్రచారానికి చెక్
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తప్పదంటూ జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే సోమవారం తెరదించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యే ఐదేళ్ల పాటు కొనసాగుతారని స్పష్టం చేశారు. సీఎం మార్పుపై పార్టీలో ఎలాంటి చర్చ జరగడం లేదని తేల్చిచెప్పారు.

గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు రాజుకున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ‘విచ్చలవిడి అవినీతి’, ‘పాలనా యంత్రాంగం కుప్పకూలింది’ అంటూ పార్టీలోని అసంతృప్త నేతల నుంచే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సఖ్యత లేదన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రిని మార్చేస్తుందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి.

ఈ పరిణామాలపై ఆర్వీ దేశ్‌పాండే స్పందిస్తూ.. “ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు కొనసాగుతారు. నాయకత్వ మార్పునకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన గానీ, చర్చ గానీ పార్టీలో జరగలేదు. శాసనసభా పక్ష సమావేశంలో ఈ అంశం ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు. దీనిపై నాతో ఎవరూ మాట్లాడలేదు. మేమంతా ఐక్యంగా ఉన్నాం, కలిసికట్టుగా పని చేస్తున్నాం” అని తెలిపారు. దేశ్‌పాండే ప్రకటనతో సిద్ధరామయ్య, శివకుమార్‌ వర్గాల మధ్య ఉన్నట్లుగా భావిస్తున్న విభేదాలకు తాత్కాలికంగా తెరపడినట్లయింది.
Siddaramaiah
Karnataka CM
Karnataka Chief Minister
DK Shivakumar
RV Deshpande
Congress Party
Karnataka Politics
CM Change
Internal Conflicts
Governance

More Telugu News