Chandrababu: అమరావతిలో క్వాంటమ్ పార్క్.. ఏపీని టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు

Chandrababu Announces Quantum Park in Amaravati to Develop AP as Tech Hub
  • విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై జాతీయ స్థాయి వర్క్‌షాప్
  • అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటన
  • ప్రభుత్వంతో చేతులు కలపనున్న టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ
  • భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని చంద్రబాబు పిలుపు
  • అధునాతన టెక్ కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్న సీఎం
రాజధాని అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీలోని కూట‌మి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భవిష్యత్ టెక్నాలజీగా భావిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో అమరావతిలో క్వాంటమ్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్ర‌భుత్వంతో కలిసి ఈ బృహత్తర ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థలు ముందుకు రావడం విశేషం.

విజయవాడలోని ఓ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 'క్వాంటమ్ వ్యాలీ' అనే అంశంపై జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వంతో చేతులు కలిపిన టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ సంస్థలకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా తాను గతంలో సీఎంగా ఉన్నప్పటి అనుభవాలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. "నేను తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టే సమయానికి ఐటీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. అప్పట్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో సమావేశమై ఐటీ అభివృద్ధిపై చర్చించాను. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించాలని ఎల్ అండ్ టీ సంస్థను కోరాను. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ హబ్‌గా ఎదుగుతుందని తాను ఆనాడే చెప్పానని అన్నారు.

అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. "రాజధాని ప్రాంతానికి ఇప్పటికే అనేక ఐటీ సంస్థలు తరలివస్తున్నాయి. ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. యువత, నూతన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్టప్ కంపెనీలను అమరావతికి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం" అని ఆయన వివరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సాంకేతికతను ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగించుకుంటామని చంద్రబాబు తెలిపారు.
Chandrababu
Amaravati
Quantum Park
Andhra Pradesh
Tech Hub
Quantum Computing
TCS
IBM
L&T
IT Industry

More Telugu News