YS Sharmila: మోదీని నిలదీసే ధైర్యం వారికెక్కడిది: జగన్, చంద్రబాబులపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

YS Sharmila Slams Jagan Chandrababu Over AP Interests and Modi
  • చంద్రబాబు, జగన్ ఇద్దరూ మోదీకి దాసోహమయ్యారన్న షర్మిల
  • కాంగ్రెస్ లోకి రావాలంటూ నేతలు, యువతకు సూచన
  • రాహుల్ ప్రధాని అయితే విభజన హామీలు అమలవుతాయని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దాసోహమయ్యారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం ఈ జూన్ నెలలోనే 26 జిల్లాల్లో సుమారు 2,500 కిలోమీటర్లు పర్యటించానని తెలిపారు. 

రాష్ట్ర విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కినా, రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా కేంద్రాన్ని నిలదీసే పరిస్థితిలో లేరని షర్మిల ఆరోపించారు. "కేంద్రంలో మోదీ అధికారంలో ఉండటానికి చంద్రబాబే కారణం. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన కేంద్రంపై కనీస ఒత్తిడి తీసుకురావడం లేదు. మరోవైపు, కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్ చివరికి తన మెడనే మోదీ ముందు వంచారు" అని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికీ మోదీని ఒక్క మాట అనకుండా, కేవలం చంద్రబాబును విమర్శిస్తూ దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లకు కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా, రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ కూడా దానిపై మాట్లాడకపోవడం దారుణమని షర్మిల మండిపడ్డారు. రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇవ్వడమేంటని ఆమె ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతామన్న హామీపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని గుర్తుచేశారు. విభజన హామీలు ఏవీ అమలు కాకపోయినా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోదీకి మద్దతు పలకడం విచారకరమన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి నుంచి బీజేపీని వ్యతిరేకించారని, కానీ జగన్ మాత్రం మోదీకి గులాంగిరీ చేశారని విమర్శించారు.

రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. "రాజకీయాలపై ఆసక్తి ఉండి, భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలనుకునే వారు, రాష్ట్రానికి సేవ చేయాలనుకునే వారు కాంగ్రెస్‌లోకి రావాలి. అందరం కలిసి పనిచేద్దాం" అని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, వైఎస్ఆర్ వంటి నేతల త్యాగాలతో నిండిన కాంగ్రెస్ పార్టీతోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్ర విభజన హామీలు పూర్తిగా అమలవుతాయని పేర్కొంటూ, సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ తిరిగి బలపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 
YS Sharmila
Andhra Pradesh
YS Jagan
Chandrababu Naidu
Narendra Modi
Congress Party
AP Politics
Polavaram Project
Visakha Steel Plant
State Bifurcation

More Telugu News