Donald Trump: ఇరాన్‌కు 30 బిలియన్ డాలర్ల ఆఫర్: స్పందించిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump Denies 30 Billion Offer to Iran
  • ఇరాన్‌కు భారీ ఆఫర్లు ఇచ్చానన్న వార్తలను ఖండించిన ట్రంప్
  • అణు కార్యక్రమం నిలిపేస్తే 30 బిలియన్ డాలర్ల సాయం అని ప్రచారం
  • అదంతా మీడియా సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమని వెల్లడి
  • దాడులు చేయమని అమెరికా హామీ ఇస్తేనే చర్చలన్న ఇరాన్
  • ఇజ్రాయెల్, అమెరికా దాడుల తర్వాత నిలిచిపోయిన అణు చర్చలు
ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని నిలిపివేస్తే భారీ ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్న వార్తలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇదంతా మీడియా సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమని ఆయన కొట్టిపారేశారు. ఇరాన్‌కు ఎలాంటి ఆఫర్లు ఇవ్వలేదని, ఆ ఆలోచనే లేదని స్పష్టం చేశారు.

ఈ విషయంపై ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక 'ట్రూత్'లో స్పందించారు. "ఇరాన్‌కు నేను ఎలాంటి ఆఫర్లు ఇవ్వడం లేదు. డెమొక్రాట్ సెనెటర్ క్రిస్ కూన్స్‌కు ఈ విషయం స్పష్టంగా చెప్పండి. గతంలో జేసీపీవోఏ ఒప్పందంలా వారికి బిలియన్ల కొద్దీ డాలర్లు ఇచ్చి అణుబాంబు తయారీకి సహకరించేది లేదు. ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశాక వారితో ఎలాంటి చర్చలూ జరపలేదు" అని ఆయన పేర్కొన్నారు. "30 బిలియన్ డాలర్లు ఇవ్వడం అనే ఆలోచన గురించి నేను ఎప్పుడూ వినలేదు" అని తేల్చి చెప్పారు.

ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ కథనం ప్రకారం, పౌర అవసరాల కోసం అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఇరాన్ అంగీకరిస్తే, అమెరికా ప్రభుత్వం 30 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది. దీనితో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను కూడా విడుదల చేసేందుకు ట్రంప్ యంత్రాంగం యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ వార్తల‌పై ట్రంప్ స్పందించారు.

మరోవైపు, అమెరికాతో చర్చలు పునఃప్రారంభం కావాలంటే భవిష్యత్తులో తమపై ఎలాంటి దాడులు చేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. చర్చల కోసం ట్రంప్ కార్యవర్గం మధ్యవర్తుల ద్వారా తమకు సందేశాలు పంపుతోందని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి మాజిద్ తక్త్ రావంచి బీబీసీకి వెల్లడించారు.
Donald Trump
Iran
Iran nuclear program
US Iran relations
JCPOA agreement
economic package

More Telugu News