MS Dhoni: 'కెప్టెన్ కూల్' ట్రేడ్‌మార్క్ కోసం ధోనీ దరఖాస్తు.. ఇకపై ఆ పేరు ఆయనకే సొంతం!

MS Dhoni Applies for Captain Cool Trademark
  • జూన్ 5న దరఖాస్తు.. జూన్ 16న ట్రేడ్‌మార్క్ జర్నల్‌లో ప్రచురణ
  • క్రీడా శిక్షణ సేవల కేటగిరీలో ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్
  • ఇటీవలే ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్' గౌరవం అందుకున్న మహీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ తన బిరుదు 'కెప్టెన్ కూల్'‌ను అధికారికంగా సొంతం చేసుకునే దిశగా కీలక అడుగు వేశాడు. మైదానంలో ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉంటూ జట్టును విజయపథంలో నడిపించడం ద్వారా ఆయనకు ఈ పేరు స్థిరపడింది. ఇప్పుడు ఇదే పేరును ట్రేడ్‌మార్క్‌గా నమోదు చేసేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నాడు.

ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్ వెల్లడించిన సమాచారం ప్రకారం... జూన్ 5న ధోనీ ఈ దరఖాస్తును దాఖలు చేశాడు. దీనిని అధికారిక ట్రేడ్‌మార్క్ జర్నల్‌లో జూన్ 16న ప్రచురించారు. ప్రస్తుతం ఈ దరఖాస్తు 'ఆమోదించబడింది మరియు ప్రచారం చేయబడింది' (accepted and advertised) అనే దశలో ఉన్నట్లు పోర్టల్ చూపిస్తోంది. క్రీడా శిక్షణ, క్రీడా శిక్షణా సౌకర్యాల కల్పన, క్రీడల్లో కోచింగ్ ఇచ్చే సేవల కేటగిరీ కింద ఈ ట్రేడ్‌మార్క్‌ను ప్రతిపాదించారు. కాగా, ట్రేడ్‌మార్క్ దరఖాస్తు విషయంపై ధోనీ బృందం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి స్పందన రాలేదు.

అయితే, ధోనీ కంటే ముందే ప్రభా స్కిల్ స్పోర్ట్స్ (ఓపీసీ) ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో సంస్థ కూడా 'కెప్టెన్ కూల్' పేరు కోసం ట్రేడ్‌మార్క్‌కు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఆ సంస్థ దరఖాస్తు స్టేట‌స్‌ 'రెక్టిఫికేషన్ ఫైల్డ్' అని చూపిస్తుండటం గమనార్హం.

ఇక‌, ఈ నెల ప్రారంభంలోనే ధోనీ ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్' 2025 సంవత్సరానికి గాను ఎంపికైన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్, దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా సహా మరో ఏడుగురు క్రికెటర్లకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

ఈ సందర్భంగా ఐసీసీ ధోనీని ప్రశంసలతో ముంచెత్తింది. "ధోనీ కేవలం గణాంకాలలోనే కాకుండా అసాధారణమైన నిలకడ, ఫిట్‌నెస్, సుదీర్ఘ కెరీర్‌తోనూ రాణించాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండటం, అసమానమైన వ్యూహాత్మక నైపుణ్యంతో పాటు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఒక మార్గదర్శకుడిగా నిలిచాడు. ఆటలో గొప్ప ఫినిషర్లలో, నాయకులలో, వికెట్ కీపర్లలో ఒకరిగా ఆయన వారసత్వానికి గుర్తింపుగా ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చడం ద్వారా గౌరవిస్తున్నాం" అని ఐసీసీ తన ప్రకటనలో కొనియాడింది.
MS Dhoni
Mahendra Singh Dhoni
Captain Cool
Dhoni trademark
ICC Hall of Fame
Cricket
Sports
Prabhaa Skill Sports
Trademark registration
Matthew Hayden

More Telugu News