Indian Railways: రైలు ప్రయాణికులకు గమనిక: అర్ధరాత్రి నుంచే కొత్త ఛార్జీల బాదుడు!

Indian Railways New Ticket Prices Effective Midnight
  • అర్ధరాత్రి నుంచి పెరగనున్న రైల్వే ప్రయాణ ఛార్జీలు
  • తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ కార్డు ఇకపై తప్పనిసరి
  • వివిధ తరగతుల్లో కిలోమీటరుకు పైసా నుంచి 2 పైసల వరకు పెంపు
  • రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు
  • ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లకు పాత ధరలే వర్తిస్తాయని స్పష్టీకరణ
దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులపై ఛార్జీల భారం పడనుంది. పెంచిన రైల్వే ఛార్జీలతో పాటు టికెట్ బుకింగ్‌లో కీలక నిబంధనలను సోమవారం అర్ధరాత్రి నుంచి అమలు చేస్తున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్ల మేనేజర్లకు ఆదేశాలతో కూడిన సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం జులై 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు, నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఏ క్లాస్‌కు ఎంత పెరిగిందంటే?

రైల్వే శాఖ తాజా నిర్ణయంతో వివిధ తరగతుల్లో టికెట్ ధరలు పెరగనున్నాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ ప్రయాణానికి సంబంధించి సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్‌ టికెట్లపై కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచారు. అదేవిధంగా, అన్ని రకాల రైళ్లలోని ఏసీ తరగతుల్లో (ఏసీ చైర్ కార్, ఏసీ 3-టైర్, 2-టైర్, ఫస్ట్ క్లాస్) ప్రయాణానికి కిలోమీటరుకు రెండు పైసల చొప్పున ఛార్జీని పెంచుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఆర్డినరీ రైళ్లలోని స్లీపర్, ఫస్ట్ క్లాస్ టికెట్లపై కిలోమీటరుకు అర పైసా చొప్పున ధర పెరగనుంది.

అయితే, ఆర్డినరీ సెకండ్ క్లాస్‌లో ప్రయాణించే వారికి పాక్షిక ఉపశమనం కల్పించారు. 500 కిలోమీటర్ల వరకు పాత ఛార్జీలనే కొనసాగించనున్నారు. 501 నుంచి 1,500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే టికెట్‌పై రూ. 5, 2001 నుంచి 2500 కిలోమీటర్లకు రూ. 10, 2501 నుంచి 3000 కిలోమీటర్ల వరకు రూ. 15 అదనంగా వసూలు చేయనున్నారు.

తత్కాల్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి

ఛార్జీల పెంపుతో పాటు తత్కాల్ టికెట్ల బుకింగ్‌ విధానంలో రైల్వే శాఖ కీలక మార్పు చేసింది. జులై 1 నుంచి తత్కాల్ కోటాలో టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించింది. అయితే, రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీలలో ఎటువంటి మార్పులు చేయలేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు పాత ఛార్జీలే వర్తిస్తాయని, పెరిగిన ధరలు వారికి వర్తించవని తేల్చిచెప్పింది.
Indian Railways
Railways
Train tickets
Ticket price hike
Tatkal booking
Aadhar card

More Telugu News