Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు జలసంఘం అనుమతి తప్పనిసరి: కేంద్ర నిపుణుల కమిటీ

Polavaram Banakacherla Project Central Committee Denies Permissions
  • పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు తాత్కాలిక అడ్డంకి
  • పర్యావరణ మదింపు ప్రతిపాదనను వెనక్కి పంపిన కేంద్ర నిపుణుల కమిటీ
  • ముందుగా కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు తప్పనిసరి అని స్పష్టీకరణ
  • అంతర్రాష్ట్ర వివాదాలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న కమిటీ
  • అనుమతులు వచ్చాకే టీఓఆర్ కోసం రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన
పోలవరం-బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ఆరంభంలోనే అడ్డంకి ఎదురైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ మదింపు ప్రక్రియను ప్రారంభించే ముందు, కేంద్ర జలసంఘం (సీడ‌బ్ల్యూసీ) నుంచి అవసరమైన అనుమతులు పొందాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ (ఈఏసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన పర్యావరణ మదింపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) ప్రతిపాదనను ప్రస్తుతం వెనక్కి పంపింది.

జూన్ 17న జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. జీజే చక్రపాణి అధ్యక్షతన భేటీ అయిన కమిటీ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారుల వాదనలను కూడా విన్నది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర జలసంఘం అనుమతి తప్పనిసరి అని తేల్చిచెప్పింది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను సోమవారం వెల్లడించింది.

ఈ ప్రాజెక్టు ప్రతిపాదనపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయని, ఇది 1980 గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయని కమిటీ గుర్తుచేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో గోదావరిలో వరద జలాల లభ్యతపై కేంద్ర జలసంఘం సహకారంతో శాస్త్రీయంగా అధ్యయనం జరగాలని సిఫార్సు చేసింది.

ముందు జలసంఘం అనుమతి తెండి
అంతర్రాష్ట్ర వివాదాలను పరిశీలించి, కేంద్ర జలసంఘం అవసరమైన అనుమతులు మంజూరు చేసిన తర్వాతే పర్యావరణ మదింపు కోసం టీఓఆర్ ప్రతిపాదనతో తమ ముందుకు రావాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రధాన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతుల అంశం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని ముంపు సమస్యల కారణంగా ఇంకా న్యాయస్థానం పరిధిలో ఉందని, ఆ విషయాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని కమిటీ వివరించింది.

ప్రాజెక్టు లక్ష్యాలు.. అంచనాలు
గోదావరి బేసిన్‌లోని పోలవరం డ్యామ్ నుంచి కృష్ణా బేసిన్‌లోని నీటి లోటు ఉన్న ప్రాంతాలకు వరద జలాలను తరలించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. రూ.81,900 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను కేంద్ర జలసంఘానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, మరో 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ తన నివేదికలో పేర్కొంది. దీంతోపాటు 400 మెగావాట్ల విద్యుదుత్పత్తి, పరిశ్రమలకు 20 టీఎంసీల నీటి సరఫరా సాధ్యమవుతుందని అంచనా వేసింది.
Polavaram Project
Polavaram Banakacherla Project
Andhra Pradesh
Godavari Water Disputes Tribunal

More Telugu News