Chinnaswamy Stadium: నిబంధనల ఉల్లంఘన.. చిన్నస్వామి స్టేడియంకు కరెంట్ కట్!

Chinnaswamy Stadium Loses Power Over Safety Violations
  • బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపివేత
  • అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణం
  • పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోని కేఎస్‌సీఏ
  • ఇదే స్టేడియం బయట ఇటీవల తొక్కిసలాటలో 11 మంది మృతి
  • భద్రతా చర్యలు లేకుండానే ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ అని వెల్లడి
భారత క్రికెట్‌కు చిరునామాగా నిలిచే మైదానాల్లో ఒకటైన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. భద్రతా నిబంధనలను పూర్తిగా గాలికొదిలేయడంతో అధికారులు స్టేడియంకు గట్టి షాక్ ఇచ్చారు. సోమవారం స్టేడియంకు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ఇటీవల ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు సన్మాన కార్యక్రమం రోజున స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటన మరవకముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించడంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) పూర్తిగా విఫలమైందని అధికారులు తేల్చిచెప్పారు. స్టేడియంలో అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ విభాగం కేఎస్‌సీఏకు పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ మేరకు ఫైర్ సర్వీసెస్ డీజీపీ జూన్ 4న ఒక లేఖ రాయగా, అది జూన్ 10న బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ (బెస్కామ్) కార్యాలయానికి చేరింది.

పలుమార్లు హెచ్చరించినా కేఎస్‌సీఏ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫైర్ సర్వీసెస్ డీజీపీ ఆదేశాల మేరకు బెస్కామ్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. సమస్యను పరిష్కరించేందుకు వారం రోజుల సమయం కావాలని కర్ణాటక క్రికెట్ సంఘం కోరినప్పటికీ ఆ గడువులోగా కూడా భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైంది.

ఇక‌, ఈ ఏడాది వేలాది మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ సరైన అగ్నిమాపక భద్రతా మార్గదర్శకాలు లేకుండానే నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన రోజున కూడా స్టేడియంలో నిర్దేశిత భద్రతా నిబంధనలు అమలులో లేవని అధికారులు తెలిపారు. వరుస హెచ్చరికలను బేఖాతరు చేయడంతోనే చివరికి స్టేడియంకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
Chinnaswamy Stadium
Karnataka State Cricket Association
KSCA
Bangalore stadium
IPL
Fire safety
BESCOM
Fire and Emergency Services
RCB
Royal Challengers Bangalore

More Telugu News