Elon Musk: ట్రంప్‌కు ఎలాన్ మస్క్ భారీ షాక్.. ఆ బిల్లు పాసైతే కొత్త పార్టీ పెడతాన‌ని హెచ్చ‌రిక‌!

Elon Musk Warns Trump Over Tax Immigration Bill
  • ట్రంప్ ప్రభుత్వ భారీ వ్యయ బిల్లుపై మస్క్ తీవ్ర వ్యతిరేకత
  • బిల్లుకు మద్దతిచ్చే ఎంపీలను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానని శపథం
  • బిల్లు పాసైతే 'అమెరికన్ పార్టీ' ఏర్పాటు చేస్తానని హెచ్చరిక
  • ఈ బిల్లుతో దేశ అప్పు 3 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందని ఆందోళన
  • సోషల్ మీడియాలో ట్రంప్, మస్క్ మధ్య ముదిరిన మాటల యుద్ధం
అమెరికా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భారీ పన్ను, వలసల బిల్లుపై టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ బహిరంగంగా యుద్ధం ప్రకటించారు. ఈ బిల్లు దేశానికి వినాశకరమని, దీనికి మద్దతిచ్చే చట్టసభ సభ్యులను వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతానని ఆయన శపథం చేశారు. అంతటితో ఆగకుండా సెనేట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందితే తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని మస్క్ హెచ్చరించారు.

అధ్యక్షుడు ట్రంప్ 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్' పేరిట ఈ ప్యాకేజీని ముందుకు తెచ్చారు. దీని ద్వారా తన మొదటి పదవీకాలంలో ప్రవేశపెట్టిన పన్ను కోతలను 4.5 ట్రిలియన్ డాలర్ల మేర పొడిగించడం, సైనిక వ్యయాన్ని పెంచడం, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వలసదారుల భారీ బహిష్కరణలకు నిధులు సమకూర్చడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఈ బిల్లు వల్ల దేశ జాతీయ అప్పు పదేళ్లలో 3.3 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరుగుతుందని, లక్షలాది మంది పేద అమెరికన్లకు ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలలో సుమారు 1 ట్రిలియన్ డాలర్ల కోత పడుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో గతంలో ట్రంప్‌కు అధ్యక్ష సలహాదారుగా పనిచేసిన ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చాక చరిత్రలోనే అతిపెద్ద అప్పుకు ఓటు వేస్తున్న ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గుతో తలదించుకోవాలి. నా జీవితంలో చివరి పనైనా సరే, వచ్చే ఏడాది ప్రైమరీ ఎన్నికల్లో వాళ్లు ఓడిపోయేలా చూస్తా" అని మస్క్ తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో తీవ్రంగా హెచ్చరించారు.

కొత్త పార్టీ పెడతానని మస్క్ హెచ్చరించడం ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. "ఈ పిచ్చి వ్యయ బిల్లు గనక పాసైతే, మరుసటి రోజే 'అమెరికన్ పార్టీ' పుడుతుంది. డెమోక్రాట్-రిపబ్లికన్ ఏకపార్టీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం మన దేశానికి అవసరం. అప్పుడే ప్రజలకు నిజమైన గొంతు ఉంటుంది" అని ఆయన పేర్కొన్నారు. సెనేట్‌లో చర్చకు రాబోతున్న వెయ్యి పేజీల ముసాయిదా బిల్లును "పూర్తిగా పిచ్చిది, వినాశకరమైనద‌ని, ఇది దేశంలో లక్షలాది ఉద్యోగాలను నాశనం చేస్తుంది" అని ఆయన విమర్శించారు.

ప్రస్తుతం యూఎస్ సెనేట్‌లో ఈ బిల్లుపై మారథాన్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యేలోపు బిల్లును ఆమోదింపజేసి అధ్యక్షుడి కార్యాలయానికి పంపాలని రిపబ్లికన్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. సెనేట్‌లో రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ ఉన్నందున, పార్టీపై ట్రంప్‌కు ఉన్న బలమైన పట్టు కారణంగా బిల్లుకు ఆమోదం లభించవచ్చని భావిస్తున్నారు. 

అయితే, సెనేట్‌లో గట్టెక్కినా ప్రతినిధుల సభలో దీనికి మరో గండం పొంచి ఉంది. అక్కడ కూడా రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీనే ఉన్నప్పటికీ పలువురు సభ్యులు దీనిని వ్యతిరేకిస్తామని ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ బిల్లు విషయంలో ట్రంప్, మస్క్ మధ్య మొదలైన విభేదాలు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం గమనార్హం.
Elon Musk
Donald Trump
US Politics
American Party
Tax Bill
Immigration Bill
US Debt
Republican Party
Democrats
US Senate

More Telugu News