Delhi Vehicles: ఢిల్లీలో 62 లక్షల వాహనాలకు నేటి నుంచి నో పెట్రోల్, నో డీజిల్.. కారణం ఇదే!

62 Lakh Vehicles Affected by New Petrol Diesel Ban In Delhi
  • 15 ఏళ్లు దాటిన పెట్రోల్, 10 ఏళ్లు దాటిన డీజిల్ బండ్లకు ఈ నిబంధన
  • వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కఠిన నిర్ణయం
  • ఆటోమేటిక్ కెమెరాల ద్వారా పాత వాహనాలను గుర్తించే ఏర్పాటు
  • వాహనదారులు, పెట్రోల్ బంక్ ల సిబ్బంది ఆందోళన
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి గడువు తీరిన (ఎండ్-ఆఫ్-లైఫ్) వాహనాలకు పెట్రోల్, డీజిల్ అమ్మకాలను నిషేధించింది. 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఈ నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) విశ్లేషణ ప్రకారం, ఢిల్లీలోని స్థానిక కాలుష్య కారకాల్లో 51 శాతం వాహనాల నుంచే వెలువడుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ నిర్ణయం వల్ల ఒక్క ఢిల్లీలోనే సుమారు 62 లక్షల వాహనాలపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది.

ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని 498 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి, 'వాహన్' డేటాబేస్‌తో సరిపోల్చుకుంటాయి. ఒకవేళ వాహనం గడువు తీరినట్లు తేలితే, ఆపరేటర్‌కు హెచ్చరిక వస్తుంది. అదే సమయంలో ఈ సమాచారం పోలీసులకు చేరడంతో, వారు ఆ వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది.

అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వాహనదారులు, పెట్రోల్ బంక్ డీలర్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలాంటి అవగాహన కల్పించకుండా, ట్రయల్ రన్ నిర్వహించకుండా ఇంత పెద్ద పథకాన్ని అమలు చేయడం సరికాదని డీలర్లు అంటున్నారు. తమకు సరైన శిక్షణ కూడా ఇవ్వలేదని కొందరు బంక్ సిబ్బంది తెలిపారు. ఈ నిబంధనల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ మీదుగా వెళ్లే పాత వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Delhi Vehicles
Delhi Pollution
Vehicle Ban
Air Quality Management
End of Life Vehicles
ANPR Cameras
Diesel Vehicles
Petrol Vehicles
Delhi Transport
CSE Report

More Telugu News