Infosys: ఎక్కువ గంటలు పని చేయొద్దు: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం

Infosys Key Decision No More Extra Work Hours
  • ఇన్ఫోసిస్ ఉద్యోగులకు కంపెనీ కీలక సూచనలు
  • పనివేళలు దాటి అదనంగా పనిచేయొద్దని సలహా
  • ఎక్కువ గంటలు పనిచేస్తున్న వారికి వ్యక్తిగత మెయిల్స్
  • ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని హెచ్‌ఆర్ విభాగం సూచన
దేశంలోని ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల ఆరోగ్యం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత పనివేళలు ముగిసిన తర్వాత అదనంగా పని చేయవద్దని, ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఉద్యోగులకు స్పష్టమైన సూచనలు జారీ చేస్తోంది. ఈ పరిణామం, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో చేసిన "వారానికి 70 గంటల పని" వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో ఐటీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

అదనపు పని వద్దంటూ వ్యక్తిగత మెయిల్స్

ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో దాదాపు 3.23 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2023 నవంబర్ నుంచి కంపెనీ హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అమలు చేస్తోంది. దీని ప్రకారం, ఉద్యోగులు నెలలో కనీసం 10 రోజుల పాటు కార్యాలయానికి వచ్చి పని చేయాల్సి ఉంటుంది. అయితే, చాలామంది ఉద్యోగులు అదనపు పని గంటలు, సరైన నిద్ర లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం వంటి కారణాలతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సంస్థ హెచ్‌ఆర్ విభాగం గుర్తించింది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని గమనించి, వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా, ఉద్యోగుల పనివేళలను నిశితంగా గమనిస్తోంది. వారంలో ఐదు రోజుల చొప్పున, రోజుకు సగటున 9.15 గంటలు పనిచేయాల్సి ఉండగా, అంతకు మించి ఎక్కువ సమయం పనిచేస్తున్న వారిని గుర్తిస్తున్నారు. ముఖ్యంగా రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగులకు, వారు ఏ రోజు ఎన్ని గంటలు పనిచేశారో వివరిస్తూ వ్యక్తిగతంగా ఈ-మెయిల్స్ పంపిస్తున్నారు. పనివేళలు ముగిసిన వెంటనే విశ్రాంతి తీసుకోవాలని, పని మధ్యలో విరామం తప్పనిసరి అని ఆ మెయిల్స్‌లో సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప, పని గంటల తర్వాత ఆఫీస్ పనులకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.

నారాయణమూర్తి అభిప్రాయానికి భిన్నంగా

కొంతకాలం క్రితం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, దేశ యువత వారానికి 70 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించి పెద్ద దుమారానికి తెరలేపారు. ఆయన అభిప్రాయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైనప్పటికీ, ఆయన తన మాటలను సమర్థించుకున్నారు. అంతేకాకుండా, 1986లో ప్రవేశపెట్టిన ఐదు రోజుల పని విధానాన్ని కూడా ఆయన విమర్శించారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు తాను పూర్తిగా వ్యతిరేకినని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో, ఇన్ఫోసిస్ యాజమాన్యం తమ ఉద్యోగుల వ్యక్తిగత ఆరోగ్యం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Infosys
Infosys employees
Narayana Murthy
work life balance
employee health
IT sector

More Telugu News