Air India: అహ్మదాబాద్ దుర్ఘటన తర్వాత రెండు రోజులకే.. అకస్మాత్తుగా 900 అడుగుల కిందకు వచ్చిన మరో విమానం!

Air India Flight Briefly Lost Altitude Near Delhi
  • అహ్మదాబాద్‌ దుర్ఘటన జరిగిన రెండు రోజుల్లోనే ఈ ఘటన
  • గాల్లో 900 అడుగులు కిందకు జారిపోయిన ఢిల్లీ-వియన్నా విమానం
  • ఘటనపై రంగంలోకి దిగిన డీజీసీఏ దర్యాప్తు
  • ఇద్దరు పైలట్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగింపు
  • దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతా లోపాలున్నాయని గుర్తింపు
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద విషాదం నుంచి దేశం ఇంకా తేరుకోకముందే ఎయిరిండియాకు చెందిన మరో విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఢిల్లీ నుంచి వియన్నా వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గాల్లో ఒక్కసారిగా 900 అడుగుల కిందకు రావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏం జరిగిందంటే?

జూన్ 14న ఢిల్లీ నుంచి వియన్నాకు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 777 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణం కారణంగా విమానం అకస్మాత్తుగా భూమివైపు దూసుకెళ్లింది. 900 అడుగుల మేర కిందకి దిగడంతో వెంటనే ప్రమాద హెచ్చరిక సిగ్నల్స్ మోగాయి. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికి అహ్మదాబాద్ దుర్ఘటన జరిగి రెండు రోజులు మాత్రమే అయింది. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

రంగంలోకి డీజీసీఏ

ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా పరిగణించింది. తక్షణమే విచారణకు ఆదేశించడమే కాకుండా, ఆ విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ జూన్ 17న ఎయిరిండియా భద్రతా విభాగాధిపతికి డీజీసీఏ సమన్లు జారీ చేసింది.

వరుస ఘటనల నేపథ్యంలో విస్తృత తనిఖీలు

జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 242 మంది ప్రయాణికులకు గాను 241 మంది దుర్మరణం చెందగా, ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విమానం ఒక మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో అక్కడ కూడా పలువురు మృతి చెందారు.

ఈ వరుస ఘటనల నేపథ్యంలో దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో డీజీసీఏ ఇటీవల విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో విమానయాన భద్రతా వ్యవస్థల్లో పలు తీవ్రమైన లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఒక విమానాశ్రయంలో అరిగిపోయిన టైర్లతో ఒక విమానం నిలిచిపోయినట్లు, మరికొన్ని విమానాల్లో ఒకేరకమైన సాంకేతిక సమస్యలు పదేపదే తలెత్తినట్లు డీజీసీఏ తన నివేదికలో పేర్కొంది. ఒక చోట పైలట్లకు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్ సాఫ్ట్‌వేర్ కూడా అప్‌డేట్ చేయలేదని, అది ప్రస్తుత విమానం కాన్ఫిగరేషన్‌తో సరిపోలడం లేదని వెల్లడించింది. పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఈ అంశాలు స్పష్టం చేస్తున్నట్లు డీజీసీఏ అభిప్రాయపడింది.
Air India
Air India flight
flight accident
DGCA
Delhi Vienna flight
flight safety
aviation accident

More Telugu News