Chandrababu Naidu: ఆ రోజు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: చంద్రబాబునాయుడు

Chandrababu Naidu Announces Free Bus Travel for Women
  • తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం
  • ప్రతినెలా ఒకటో తేదీన గ్రామాల్లో పండగ వాతావరణానికి పింఛన్లే కారణమన్న ముఖ్యమంత్రి
  • గత ప్రభుత్వ హయాంలో జీతాలు, పింఛన్లు సరిగా ఇవ్వలేదని విమర్శ
  • సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
  • ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ
  • ప్రజావేదికలో డప్పు వాయించి అందరినీ ఉత్సాహపరిచిన చంద్రబాబు
ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుందంటే, దానికి ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లే కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మలకపల్లిలో మంగళవారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం ఏర్పాటు చేసిన 'ప్రజావేదిక'లో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాలు, లబ్ధిదారులకు పింఛన్లు సక్రమంగా అందని దుస్థితి ఉండేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ‘పేదల సేవలో’ అనే కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తోందని తెలిపారు. కేవలం పింఛన్ల కోసమే ప్రభుత్వం ప్రతినెలా రూ. 2,750 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన వివరించారు.

"రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకుంటాం. వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది" అని చంద్రబాబు ఆరోపించారు. తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంపద సృష్టించి, ఆ ఫలాలను పేదలకు పంచుతామని పునరుద్ఘాటించారు.

కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ‘తల్లికి వందనం’ పథకం కోసం ఇప్పటికే రూ.10,000 కోట్లు జమ చేశామని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం, స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు.

ఇటీవల విశాఖలో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమం ద్వారా 2 గిన్నిస్‌ రికార్డులు, 21 వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులు సాధించి రాష్ట్ర ఖ్యాతిని పెంచామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా వేదికపై ముఖ్యమంత్రి డప్పు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు.
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Free Bus Travel
Women Free Bus

More Telugu News