BV Pattabhiram: పట్టాభిరామ్ గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: నారా లోకేశ్

BV Pattabhiram Death Nara Lokesh Expresses Grief
  • ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
  • గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
  • ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన నారా లోకేశ్
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మెజీషియన్, హిప్నాటిస్టు, రచయిత, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్‌గా ఆయన తెలుగు ప్రజలకు సుపరిచితులు. ఆయన మరణ వార్తతో వ్యక్తిత్వ వికాస రంగంలో విషాదం నెలకొంది.

పట్టాభిరామ్ మరణం పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. "ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మెజీషియన్ బీవీ పట్టాభిరామ్ గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మెజీషియన్‌గా, హిప్నాటిస్టుగా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్‌గా బీవీ పట్టాభిరామ్ ఎనలేని సేవలు అందించారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

పట్టాభిరామ్ కేవలం వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాకుండా రచయితగానూ విశేష కీర్తిని గడించారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్, కన్నడ, తమిళ భాషల్లోనూ ఆయన అనేక పుస్తకాలు రచించారు. ఒత్తిడిని జయించడం, ఆత్మవిశ్వాసం, మానవ సంబంధాలు వంటి అంశాలపై భారత్‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి పలు దేశాల్లో వేలాది వర్క్‌షాపులు నిర్వహించి లక్షలాది మందిలో స్ఫూర్తి నింపారు. హిప్నోసిస్‌పై ఆయన చేసిన కృషికి గాను ఫ్లోరిడా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన ఆయన, సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే), రాష్ట్ర పోలీసు అకాడమీ, షార్ శ్రీహరికోట, డీఆర్‌డీఎల్, భారత్ డైనమిక్స్, ఎన్‌ఐఆర్‌డీ సహా అనేక ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఆయన గౌరవ సలహాదారుగా సేవలు అందించారు. ఆయన మృతి వ్యక్తిత్వ వికాస రంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
BV Pattabhiram
Nara Lokesh
personality development
soft skills trainer
hypnotist
magician
Telugu writer
Andhra Pradesh
obituary
social media

More Telugu News