DK Shivakumar: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ప్రకంపనలు.. అనుచరులకు డీకే శివకుమార్ ఆదేశాలు

DK Shivakumar instructs followers amid Karnataka CM change rumors
  • నాయకత్వ మార్పు ఉండదని స్పష్టం చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం
  • ఇది బీజేపీ కుట్రేనంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూర్జేవాలా ఆరోపణ
  • సిద్ధరామయ్యకు లాటరీ తగిలిందన్న ఎమ్మెల్యే మాటలతో కొత్త వివాదం
  • లీకైన వీడియోతో కర్ణాటక రాజకీయాల్లో మరింత పెరిగిన వేడి
కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి మార్పు ఖాయమని, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన వర్గానికి చెందిన నాయకుల ప్రకటనలతో మొదలైన ఈ వివాదం, కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యంతో సద్దుమణిగిందని అనుకుంటున్న తరుణంలోనే మరో రూపంలో బయటపడింది. ఒక సీనియర్ ఎమ్మెల్యే ఫోన్ సంభాషణకు సంబంధించిన వీడియో లీక్ అవ్వడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది.

కొద్ది రోజులుగా కర్ణాటకలో ముఖ్యమంత్రిని మారుస్తారని, రెండు మూడు నెలల్లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన మద్దతుదారుడైన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఈ నేపథ్యంలో స్పందించిన డీకే శివకుమార్ ఆ వ్యాఖ్యలను ఖండించారు.

‘‘నా తరఫున ఎవరూ మాట్లాడొద్దు. పార్టీ ప్రయోజనాలే నాకు ముఖ్యం. మనమంతా 2028 ఎన్నికలపై దృష్టి పెట్టాలి. కాంగ్రెస్‌లో వర్గాలు లేవు. మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పనిచేస్తున్న ఒకే ఒక కాంగ్రెస్ ఉంది’’ అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తగా అధిష్ఠానం ఆదేశాలను పాటించడమే తన విధి అని ఆయన పేర్కొన్నారు.

దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే రంగంలోకి దిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలాను హుటాహుటిన కర్ణాటకకు పంపింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న గ్యారంటీ పథకాలను అడ్డుకునేందుకే బీజేపీ ఇలాంటి నిరాధారమైన పుకార్లను సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.

లీకైన వీడియోతో కొత్త కలకలం

అధిష్ఠానం, డీకే శివకుమార్ ఇద్దరూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే సీనియర్ నేత బీఆర్ పాటిల్‌కు సంబంధించిన ఒక వీడియో బయటకు రావడం కలకలం రేపింది. ఆ వీడియోలో ఆయన ఒకరితో ఫోన్‌లో మాట్లాడుతూ ‘‘సిద్ధరామయ్యకు లాటరీ తగిలింది. ఆయన్ను సోనియాగాంధీకి పరిచయం చేసిందే నేను. ఆయన అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయ్యారు. నాకు ఏ గాడ్ ఫాదర్ లేరు. నేను సూర్జేవాలాను కలిసి చెప్పాల్సింది చెప్పాను. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని అనడం స్పష్టంగా వినిపించింది.
DK Shivakumar
Karnataka politics
Congress party
Siddaramaiah
leadership change

More Telugu News