Chandrababu Naidu: రాజకీయ ముసుగులో దోపిడీని సహించను: ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక

Chandrababu Naidu warns against corruption in the guise of politics
  • కొవ్వూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ
  • గత ప్రభుత్వంలో పింఛన్ల పేరుతో దోపిడీ జరిగిందని ఆరోపణ
  • రాష్ట్రంలో పింఛన్ల కోసం నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడి
  • ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, త్వరలో నిరుద్యోగ భృతి
  • 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం
  • పేదరిక నిర్మూలనకు 'పీ4' అనే కొత్త విధానం తీసుకొచ్చామని ప్రకటన
ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తుండటంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వంలో జరిగిన మోసాలకు, అక్రమాలకు చరమగీతం పాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం కొవ్వూరు నియోజకవర్గంలోని మలకపల్లిలో నిర్వహించిన 'పేదల సేవలో' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. సానమాండ్ర పోశిబాబు అనే లబ్ధిదారుడికి చర్మకార పింఛను, గెడ్డం కృష్ణదుర్గకు వితంతు పింఛను అందజేసి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

పింఛన్ల పంపిణీలో దేశంలోనే ఏపీ ముందుంది

గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు సక్రమంగా అందేవి కావని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక ఒకటో తేదీనే అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తాను గతంలో రూ.200 ఉన్న పింఛనును రూ.2,000 చేశానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు రూ.4,000కు పెంచామని గుర్తుచేశారు. "డయాలసిస్ రోగులకు రూ.10 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాం. పింఛన్ల కోసం నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు చేస్తున్నాం. తెలంగాణ, కేరళ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా ఈ విషయంలో మన దరిదాపుల్లో లేవు" అని ఆయన వివరించారు.

గత పాలనపై తీవ్ర విమర్శలు

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని, వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. "రాజకీయ ముసుగులో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవారిని ఉపేక్షించను. గత ప్రభుత్వంలో వైకల్యం లేనివారికి కూడా పింఛన్లు ఇచ్చి ప్రజాధనాన్ని దోచేశారు. గంజాయి బ్యాచ్‌ను పరామర్శించే వారిని ఏమనాలో ప్రజలే ఆలోచించాలి. గంజాయి, డ్రగ్స్ అమ్మితే తాట తీస్తాం," అని హెచ్చరించారు. వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ, గుండెపోటు అని చెప్పి తననే నమ్మించారని, ఆనాడే నిందితులను అరెస్టు చేసి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కీలక ప్రకటనలు

రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. నెల రోజుల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, వీలైనంత త్వరగా నిరుద్యోగ భృతికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, ఈ ఏడాది డిసెంబర్‌కల్లా డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామన్నారు.

పేదరిక నిర్మూలనకు 'పీ4' విధానం

పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా 'పీ4' (ప్రభుత్వం-ప్రైవేటు-ప్రజలు-పరోపకారం) విధానానికి శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన మూలపర్తి నవ్యశ్రీ అనే విద్యార్థిని తన గోడును వెళ్లబోసుకుంది.

దీనికి తక్షణమే స్పందించిన ఠాకూర్ లేబొరేటరీస్ ప్రతినిధి, ఆ అమ్మాయి చదువుతో పాటు ఉద్యోగ బాధ్యతలను తమ సంస్థ తీసుకుంటుందని ప్రకటించారు. దీనిపై సీఎం హర్షం వ్యక్తం చేస్తూ, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు పేద కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక హామీలిచ్చారు. ఇక్కడ డిగ్రీ కాలేజీ ఏర్పాటు, ప్రభుత్వాసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని, లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Pensions
Welfare schemes
Polavaram Project

More Telugu News