Jaishankar: ఆ రోజు ఏం జరిగిందంటే?: ఆపరేషన్ సిందూర్-ట్రంప్ జోక్యంపై జైశంకర్ వివరణ

Jaishankar Clarifies Operation Sindoor Trump Intervention Claims
  • భారత్-పాక్ యుద్ధం ఆపానన్న ట్రంప్ వాదనలో నిజం లేదన్న జైశంకర్
  • అమెరికా అధ్యక్షుడి ప్రచారాన్ని తోసిపుచ్చిన జైశంకర్
  • మే 9న పాక్ దాడి, భారత్ దీటైన జవాబు ఇచ్చిందన్న మంత్రి
  • పాకిస్థానే నేరుగా కాల్పుల విరమణకు ముందుకొచ్చిందని వెల్లడి
  • పహల్గామ్ దాడిని ఆర్థిక యుద్ధంగా అభివర్ణన
  • ఉగ్రవాద నిర్మూలనలో అణు బెదిరింపులకు లొంగబోమని స్పష్టీకరణ
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఆ ప్రచారాన్ని ఆయన పూర్తిగా ఖండించారు. కాల్పుల విరమణ ఒప్పందం వెనుక జరిగిన అసలు వాస్తవాలను ఆయన ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే 'న్యూస్‌వీక్‌'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జైశంకర్ మాట్లాడుతూ, మే 9వ తేదీ రాత్రి జరిగిన పరిణామాలను గుర్తుచేసుకున్నారు. "ఆ రోజు రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఆ సమయంలో నేను ప్రధానితో పాటే ఉన్నాను. పాకిస్థాన్ నుంచి భారత్‌పై పెద్ద ఎత్తున దాడి జరిగే ప్రమాదం ఉందని వాన్స్ హెచ్చరించారు. ఒకవేళ పాక్ దుస్సాహసానికి పాల్పడితే అందుకు తగిన రీతిలో, దీటుగా బదులిస్తామని మోదీ ఆయనకు స్పష్టం చేశారు" అని జైశంకర్ తెలిపారు.

ఆ తర్వాత జరిగిన ఘటనలను వివరిస్తూ "అనుకున్నట్టే ఆ రాత్రి పాకిస్థాన్ భారత్‌పై భారీ దాడికి తెగబడింది. అయితే, భారత బలగాలు ఆ దాడులను అత్యంత సమర్థవంతంగా, వేగంగా తిప్పికొట్టాయి" అని జైశంకర్ పేర్కొన్నారు. కాల్పుల విరమణకు దారితీసిన పరిస్థితులను ఆయన విడమరిచి చెప్పారు.

ఆ మరుసటి రోజు ఉదయం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తనకు ఫోన్ చేసి, పాకిస్థాన్ చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పినట్లు జైశంకర్ వెల్లడించారు. అయితే, ఆ తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుందని ఆయన అన్నారు. "అదే రోజు మధ్యాహ్నం, పాకిస్థాన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో) మేజర్ జనరల్ ఖసిఫ్ అబ్దుల్లా, భారత డీజీఎంవో రాజీవ్ ఘాయ్‌కు నేరుగా ఫోన్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం పాటిద్దామని ప్రతిపాదించారు. అసలు జరిగింది ఇది" అని జైశంకర్ తేల్చిచెప్పారు. వాణిజ్యానికి, కాల్పుల విరమణకు భారత్ పరంగా ఎలాంటి సంబంధం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

పహల్గామ్ దాడి ఆర్థిక యుద్ధమే

ఇదే ఇంటర్వ్యూలో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని జైశంకర్ ఒక 'ఆర్థిక యుద్ధ చర్య'గా అభివర్ణించారు. కశ్మీర్ లోయలో అభివృద్ధిని, శాంతిని ఓర్వలేకే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన అన్నారు. "జమ్మూకశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ దాడి చేశారు. మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు, పర్యాటకుల మతం అడిగి మరీ వారిని కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని మేం నిర్ణయించుకున్నాం" అని తెలిపారు. ఉగ్రవాదులకు, వారికి అండగా నిలిచే ప్రభుత్వాలకు భారత్ తగిన బుద్ధి చెబుతుందని, ఉగ్రవాదాన్ని అణిచివేసే క్రమంలో ఎలాంటి అణ్వస్త్ర బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు.
Jaishankar
S Jaishankar interview
India Pakistan conflict
Donald Trump claim
Ceasefire agreement

More Telugu News