Jagan: సోషల్ మీడియాను ఆయుధంగా వాడండి: జగన్

Jagan Calls to Use Social Media as Weapon
  • వైసీపీ యువజన విభాగంతో అధినేత జగన్ కీలక సమావేశం
  • ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను యువత ప్రశ్నించాలని పిలుపు
  • పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో యువత కీలక పాత్ర పోషించాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. అన్యాయాలను, అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి సోషల్ మీడియాను ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో జరిగిన సమావేశంలో జగన్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... యువజన విభాగం పార్టీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని జగన్ అన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి వ్యవస్థీకృతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఈ బాధ్యతలో యువత ముందుండాలని దిశానిర్దేశం చేశారు. "కష్టపడి పనిచేస్తే మిమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత నాది. రాజకీయంగా ఎదగడానికి యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. సమర్థత ఉన్నవారిని గుర్తించి పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురండి" అని జగన్ వారికి భరోసా ఇచ్చారు. యువజన విభాగం పనితీరును మరింత మెరుగుపరిచేందుకు జోన్ల వారీగా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తున్నామని, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన యువ నేతలు ఈ బాధ్యతలు చూస్తారని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ యువతలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. "పార్టీ పెట్టినప్పుడు నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. నాపై అభిమానంతోనే ఎందరో నాతో కలిసి నడిచారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. 2014లో 67 మంది ఎమ్మెల్యేలతో గెలిస్తే, వారిలో 23 మందిని లాక్కున్నారు. అయినా విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి ఉన్నాం" అని జగన్ అన్నారు. ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన విషయాన్ని, 18 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకున్న సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు.

రాజకీయాల్లో నాయకులకు ప్రజలతో సంబంధాలు అత్యంత ముఖ్యమని జగన్ ఉద్బోధించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారికి తోడుగా నిలబడాలని, మంచి పలకరింపుతో వారి మనసులను గెలుచుకోవాలని సూచించారు. "ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి. వారి సమస్యల్లో అండగా నిలిచినప్పుడే నాయకులుగా ఎదుగుతారు. మీ పనితీరును ఎప్పటికప్పుడు మీరే సమీక్షించుకోవాలి" అని ఆయన హితవు పలికారు.
Jagan
YS Jagan
YSRCP
YSR Congress
Social Media
Youth
Andhra Pradesh Politics
Tadepalli
Political Strategy
Public Issues

More Telugu News