Siddaramaiah: అవును.. నేను అదృష్టవంతుడినే: లాటరీ తగిలిందన్న వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందన

Siddaramaiah Acknowledges Luck Amid Lottery Remark Controversy
  • ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అదృష్టవంతుడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వ్యాఖ్య
  • అవును, అదృష్టం వల్లే ముఖ్యమంత్రిని అయ్యానని బదులిచ్చిన సిద్ధరామయ్య
  • ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందంటూ పాటిల్ ఆరోపణలు
  • మరికొందరు ఎమ్మెల్యేల నుంచి కూడా ప్రభుత్వ తీరుపై అసంతృప్తి గళం
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలు అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేవలం అదృష్టం వల్లే ఆ పదవిలో ఉన్నారంటూ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు, ముఖ్యమంత్రి అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ మంగళవారం మాట్లాడుతూ, “సిద్ధరామయ్యకు లాటరీ తగిలింది. ఆయన్ను సోనియాగాంధీకి పరిచయం చేసిందే నేను. ఆయన అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయ్యారు. నాకు ఏ గాడ్‌ ఫాదర్ లేరు. నేను పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సూర్జేవాలాను కలిసి చెప్పాల్సిందంతా చెప్పా. ఏం జరుగుతుందో చూద్దాం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వీడియో బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగింది.

ఈ విమర్శలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనదైన శైలిలో స్పందించారు. “అవును.. నేను అదృష్టవంతుడినే. అందుకే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాను” అని బదులిచ్చారు.

అసలేం జరిగింది?

తన నియోజకవర్గమైన అలంద్‌లో పేదలకు ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఇటీవల ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను గృహనిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఖండించారు. కేటాయింపులన్నీ పారదర్శకంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ వివాదం తర్వాత మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజు కాజే, బేలూర్ గోపాలకృష్ణ కూడా తమ ప్రభుత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కారు.

రంగంలోకి అధిష్ఠానం

ఎమ్మెల్యేల నుంచి వరుసగా అసమ్మతి స్వరాలు వినిపిస్తుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలాను బెంగళూరుకు పంపింది. ఆయన అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాల వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న గ్యారంటీలు నిలిచిపోవాలనే దురుద్దేశంతోనే బీజేపీ ఇలాంటి ప్రచారాలు చేస్తోందని ఆయన విమర్శించారు.
Siddaramaiah
Karnataka Congress
BR Patil
Sonia Gandhi
Karnataka Politics
Congress MLA

More Telugu News