Mohammed Shami: టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి భారీ షాక్.. భరణంపై హైకోర్టు సంచలన తీర్పు!

Calcutta HC orders Mohammed Shami to pay Rs 4 lakh alimony to estranged wife
  • క్రికెటర్ మహ్మద్ షమీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ
  • భార్య హసీన్ జహాన్‌కు నెలకు రూ. 1.5 లక్షలు చెల్లించాలని ఆదేశం
  • కూతురి సంరక్షణ, ఖర్చుల కోసం నెలకు మ‌రో రూ. 2.5 లక్షలు ఇవ్వాలని తీర్పు
  • దిగువ కోర్టు ఇచ్చిన భరణం సరిపోదంటూ హసీన్ జహాన్ అప్పీల్
  • షమీ ఆర్థిక స్థోమత ఆధారంగా భరణాన్ని గణనీయంగా పెంచిన హైకోర్టు
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి వ్యక్తిగత కేసులో కలకత్తా హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్ జహాన్, వారి కుమార్తెకు చెల్లించాల్సిన మధ్యంతర భరణాన్ని భారీగా పెంచుతూ మంగళవారం న్యాయ‌స్థానం కీలక తీర్పు ఇచ్చింది. హసీన్ జహాన్‌కు ప్రతినెలా రూ. 1.5 లక్షలు, వారి కుమార్తె సంరక్షణ, ఖర్చుల నిమిత్తం మరో రూ. 2.5 లక్షలు కలిపి మొత్తం రూ. 4 లక్షలు చెల్లించాలని షమీని ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే... గతంలో అలీపూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హసీన్ జహాన్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఆ తీర్పు ప్రకారం, హసీన్ జహాన్‌కు నెలకు రూ. 50 వేలు, కుమార్తెకు రూ. 80 వేలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించారు. అయితే, ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని, తన నెలవారీ ఖర్చులు సుమారు రూ. 6 లక్షలు ఉండగా, తన ఆదాయం కేవలం రూ. 16 వేలు మాత్రమేనని హసీన్ తన అప్పీల్‌లో పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇతర భారత క్రికెటర్ల పిల్లలు చదివే స్థాయి పాఠశాలలో తన కుమార్తెను చేర్పించలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హసీన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మహ్మద్ షమీ ఆర్థిక స్థోమత, అతని అసలు ఆదాయం, జీవన ప్రమాణాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని భరణాన్ని పెంచాలని కోరారు. తనకు నెలకు రూ. 7 లక్షలు, కుమార్తెకు రూ. 3 లక్షలు చొప్పున భరణం ఇప్పించాలని హసీన్ తన పిటిషన్‌లో అభ్యర్థించారు.

మరోవైపు, మహ్మద్ షమీ తరఫు న్యాయవాది ఈ వాదనలను వ్యతిరేకించారు. హసీన్ జహాన్‌కు మోడలింగ్, యాక్టింగ్, వ్యాపారాల ద్వారా ఆదాయం ఉందని, ఆమె ఆస్తులు కూడా కొనుగోలు చేశారని తెలిపారు. ఆర్థికంగా ఏమీ లేని నిస్సహాయురాలిగా ఆమె తప్పుగా చిత్రీకరించుకుంటున్నారని కోర్టుకు వివరించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అజోయ్ కుమార్ ముఖర్జీ నేతృత్వంలోని ధర్మాసనం, అలీపూర్ కోర్టు నిర్ధారించిన భరణం మొత్తాన్ని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. "భర్త అయిన షమీ ఆదాయం, ఆర్థిక వివరాలను పరిశీలిస్తే, అతను ఎక్కువ మొత్తం చెల్లించగల స్థితిలో ఉన్నాడని స్పష్టమవుతోంది. భార్య వివాహం చేసుకోకుండా కుమార్తెతో కలిసి విడిగా జీవిస్తోంది. వివాహ బంధంలో ఉన్నప్పుడు అనుభవించిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా భరణం పొందే హక్కు ఆమెకు ఉంది. ఇది ఆమె భవిష్యత్తుకు, కుమార్తె భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి" అని కోర్టు పేర్కొంటూ భరణం మొత్తాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Mohammed Shami
Hasin Jahan
Mohammed Shami case
Alipore court
Kolkata High Court
maintenance
divorce case
Indian cricketer
domestic violence
cricket news

More Telugu News