ISKCON Temple: ఇస్కాన్ ఆలయంపై కాల్పులు.. చర్యలు తీసుకోవాలని అమెరికాకు భారత్ డిమాండ్

Iskcon Temple in US Utah targeted 20 TO 30 bullets fired over past several days India urges action
  • అమెరికాలోని ఉతాహ్‌లో ఇస్కాన్ ఆలయంపై కాల్పుల ఘటన
  • దాడిని తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికాకు సూచన
  • ఆలయంపై 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపిన దుండగులు
అమెరికాలోని ప్రముఖ హిందూ దేవాలయం ఇస్కాన్‌పై కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉతాహ్‌ రాష్ట్రంలోని స్పానిష్ ఫోర్క్‌లో ఉన్న శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులను కోరింది.

ఈ ఘటనపై శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం స్పందించింది. ఇస్కాన్ ఆలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ఆలయ అధికారులకు, భక్తులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చింది. ఈ వ్యవహారంలో స్థానిక యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని, నిందితులను పట్టుకోవాలని స్పష్టం చేసింది.

ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడి రాత్రి సమయంలో జరిగింది. ఆ సమయంలో భక్తులు, అతిథులు ఆలయంలోనే ఉన్నారు. దుండగులు సుమారు 20 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరపడంతో ఆలయ స్వాగత తోరణాలు, గోడలు, కిటికీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గోడల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం సాధారణ దాడి కాదని, హిందూ సమాజంపై విద్వేషంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఇస్కాన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

ఈ ఆలయంపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదని ఆలయ అధ్యక్షుడు వాయ్ వార్డెన్ తెలిపారు. కేవలం గత నెలలోనే మూడుసార్లు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న తమ ఆలయంపై ఇటీవల వరుస దాడులు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం ఈ మధ్యకాలంలో ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది మార్చి నెలలో కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో ఉన్న బాప్స్ (BAPS) స్వామినారాయణ ఆలయంపై కూడా దాడి జరిగింది. ఈ వరుస ఘటనలు అమెరికాలోని హిందూ సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. 
ISKCON Temple
ISKCON Temple Utah
Hindu Temple Vandalism
America Hindu Temple Attack
Utah Shooting
Radha Krishna Temple
Hindu Community
Hate Crime
Vay Warden
BAPS Swaminarayan Temple

More Telugu News