Siddiqui: అన్నమయ్య జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఐబీ

Siddiqui and Ali Two terrorists arrested in Annamayya district
  • రాయచోటిలో కోయంబత్తూరు పేలుళ్ల కేసు నిందితులు
  • 30 ఏళ్లుగా మారు పేర్లతో రహస్య జీవనం సాగిస్తున్న నిందితులు
  • స్థానిక పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్న చెన్నై ఐబీ అధికారులు
అన్నమయ్య జిల్లా రాయచోటిలో మూడు దశాబ్దాలుగా రహస్య జీవితం గడుపుతున్న ఇద్దరు ఉగ్రవాదులను చెన్నై ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు అరెస్టు చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులుగా ఉన్న సిద్ధిఖీ, మహమ్మద్ ఆలీ అనే సోదరులు మారుపేర్లతో 30 ఏళ్లుగా రాయచోటిలో చీరల వ్యాపారం నిర్వహిస్తూ రహస్యంగా జీవిస్తున్నారు.

వీరు 1985లో కోయంబత్తూరు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ రథయాత్ర సందర్భంగా కుట్ర చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. వీరు ఇద్దరూ మారుపేర్లతో రాయచోటిలో ఉన్నట్లు గుర్తించిన చెన్నై ఐబీ అధికారులు నిన్న స్థానిక పోలీసుల సహకారంతో వారి ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

సిద్ధిఖీ, మహమ్మద్ అలీ ఇళ్లలో తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, కొంత సామాగ్రిని ఐబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిద్దరినీ చెన్నై తీసుకుని వెళ్లారు. గత మూడు దశాబ్దాలుగా బట్టల వ్యాపారం నిర్వహిస్తూ సాధారణ జీవితం గడుపుతున్న ఈ సోదరులు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించిన వారని తెలియడంతో స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తమిళనాడు నుంచి వచ్చిన పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 
Siddiqui
Annamayya district
Rayachoti
terrorists arrested
Chennai IB
bomb blast case
LK Advani
Coimbatore blasts
Tamil Nadu police
secret life

More Telugu News