Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్ కుమారుడు!

Mangalagiri AIIMS Ragging Case Deans Son Among Suspended
  • మంగళగిరి ఎయిమ్స్‌లో సీనియర్ల ర్యాగింగ్‌
  • జూనియర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
  • బాధ్యులైన 13 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
  • ఏడాదిన్నర పాటు సస్పెన్షన్.. రూ. 25 వేల జరిమానా విధింపు
రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక వైద్య విద్యాసంస్థ మంగళగిరి ఎయిమ్స్‌ ర్యాగింగ్ ఘటనలో సస్పెండ్ అయిన 13 మందిలో ఎయిమ్స్ డీన్ కుమారుడు కూడా ఉన్నట్టు తెలిసింది. తిరుపతికి చెందిన ఓ విద్యార్థి మంగళగిరి ఎయిమ్స్‌లో మొదటి సంవత్సరం వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. గత నెల 22న హాస్టల్‌లో తన స్నేహితుడితో మాట్లాడుతుండగా కొందరు సీనియర్లు అతడిని అడ్డగించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. వారి వేధింపులు శ్రుతిమించడంతో మనోవేదనకు గురైన విద్యార్థి బ్లేడుతో చేతిని కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన తోటి విద్యార్థులు విషయాన్ని వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.

యాజమాన్యం తక్షణ చర్యలు
ఘటన జరిగిన మరుసటి రోజు అంటే జూన్ 23న ఎయిమ్స్ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరుతూ మెయిల్ రావడంతో యాజమాన్యం అంతర్గత విచారణకు ఆదేశించింది. ఎయిమ్స్‌లోని ర్యాగింగ్ నిరోధక కమిటీ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. ప్రాథమిక దర్యాప్తులో 15 మంది ప్రమేయం ఉన్నట్టు తేలడంతో జూన్ 24న వారందరినీ సస్పెండ్ చేశారు. అనంతరం పూర్తిస్థాయి విచారణ జరిపి, 13 మంది విద్యార్థుల పాత్ర మాత్రమే ఉందని నిర్ధారించారు. మానసికంగా కుంగిపోయిన బాధితుడిని తల్లిదండ్రులు తమ స్వస్థలానికి తీసుకెళ్లినట్టు సమాచారం.

శిక్షల వివరాలు ఇలా..
విచారణ కమిటీ సిఫార్సుల మేరకు ర్యాగింగ్‌కు పాల్పడిన వారిలో ముగ్గురు సీనియర్లను ఏడాదిన్నర పాటు (3 సెమిస్టర్లు) సస్పెండ్ చేసి, ఒక్కొక్కరికీ రూ. 25 వేల జరిమానా విధించారు. మరో ఆరుగురిని ఏడాది కాలం (2 సెమిస్టర్లు), మిగిలిన నలుగురిని ఆరు నెలల పాటు (ఒక సెమిస్టర్) సస్పెండ్ చేశారు. వీరందరికీ రూ. 25 వేల చొప్పున జరిమానా విధించడంతో పాటు, హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు.

పోలీసు ఫిర్యాదుపై భిన్న కథనాలు
ఈ ఘటనపై జూన్ 24నే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎయిమ్స్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందుకే కేసు నమోదు చేయలేదని మంగళగిరి రూరల్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారం మంగళవారం సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కడంతో, పోలీసులకు ఫిర్యాదు విషయంలో ఎయిమ్స్, పోలీసుల మధ్య భిన్న కథనాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది.
Mangalagiri AIIMS
AIIMS Ragging
Ragging Case
AIIMS Dean Son
Medical Student Suicide Attempt
Andhra Pradesh News
Mangalagiri News
Anti Ragging Committee
Hostel
Student Suspension

More Telugu News