Nagendra: కాకినాడ యువకుడి సృజనాత్మకత .. మినీ యుద్ద నౌక తయారీ .. పవన్ ఆహ్వానం అందేనా!

Nagendras Creation Kakinada Youth Builds Mini War Tank
  • మినీ యుద్ద ట్యాంక్ ను తయారు చేసిన కాకినాడ యువకుడు నాగేంద్ర
  • కాకినాడ లైట్ హౌస్ బీచ్ వద్ద ఈ యుద్ద ట్యాంక్ ప్రదర్శన
  • నాగేంద్ర నైపుణ్యానికి పలువురి ప్రశంసలు
  • పవన్ కల్యాణ్ ను కలిసి తన కోరిక తెలియజేయాలని ఆశిస్తున్నానన్న నాగేంద్ర 
కాకినాడ జిల్లా యు. కొత్తపల్లి మండలం వెంకట్రాయిపురం గ్రామానికి చెందిన యువకుడి సృజనాత్మకత ప్రశంసలు అందుకుంటోంది. పెద్ద చదువులు చదవకపోయినా నాగేంద్ర అనే యువకుడు ఓ మినీ యుద్ధ ట్యాంక్‌ను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఐటీఐ ఫిట్టర్ వరకు మాత్రమే చదివి ప్రస్తుతం కాకినాడలో డ్రైవర్‌గా పని చేస్తున్న నాగేంద్రకు చిన్నతనం నుంచి ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే కోరిక ఉండేదట. ఆ మక్కువతోనే ఐదేళ్ల క్రితం చెక్కలను ఉపయోగించి చిన్నపాటి ట్యాంక్ తయారు చేశాడు. దాన్ని కాకినాడ ఎస్పీ కార్యాలయానికి అందించి అధికారుల ప్రశంసలు అందుకున్నాడు.

ఇప్పుడు అదే తరహాలో ఓ వ్యక్తి ప్రోత్సాహంతో రూ.1.80 లక్షల వ్యయంతో మినీ యుద్ధ ట్యాంక్ తయారు చేశాడు. ఈ మినీ యుద్ధ ట్యాంక్‌ను కాకినాడ లైట్ హౌస్ బీచ్ వద్ద ప్రదర్శనకు ఉంచగా, పలువురు ఈ యువకుడి నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు.

ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. ట్రాక్టర్, ఆటో, మోటారు సైకిళ్లలోని పలు పరికరాలు, ఇనుప రేకులు, సీలింగ్ తయారు చేసే షీట్లు, విద్యుత్ పరికరాలు ఉపయోగించి దీన్ని తయారు చేసినట్లు తెలిపాడు. సుమారు 45 రోజుల పాటు శ్రమించి ఈ ట్యాంకర్‌ను తయారు చేసినట్లు చెప్పాడు.

తనకు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్న ఆలోచన ఉండేదని, ఆ క్రమంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు వెళ్లానని, అయితే రన్నింగ్‌లో వెనుకబడటం జరిగిందన్నారు. ఆర్మీలో చేరాలన్న కోరిక ఫలించకపోవడంతో బాధ కలిగిందన్నారు. అయినప్పటికీ ఏదో విధంగా ఆర్మీకి ఉపయోగపడాలన్న ఆలోచనతో దీన్ని తయారు చేసినట్లు చెప్పాడు.

తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ మినీ యుద్ధ ట్యాంకర్‌ను తయారు చేసినట్లు తెలిపాడు. దీని నుంచి ప్రతి ఐదు సెకన్లకు ఒక తూటా పేలుతుందని, ఇలా ఆరు తూటాలు వస్తాయన్నారు. తూటా సుమారు 600 మీటర్ల వరకూ వెళుతుందన్నాడు. ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టం అని, ఆయనను కలిసి ఆర్మీకి సేవ చేయాలన్న తన ఆకాంక్షను పంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. మంచి ప్రతిభ కలిగిన ఈ యువకుడికి పవన్ ఆహ్వానం పలుకుతారని, అతని కోరిక నెరవేరుతుందని ఆశిద్దాం. 
Nagendra
Kakinada
Mini War Tank
Pawan Kalyan
Army
Youth Innovation
Andhra Pradesh
Defense
Light House Beach

More Telugu News