Nandigam Suresh: జైలు నుంచి నందిగం సురేశ్ విడుదల.. చివరి శ్వాస వరకు జగన్‌తోనేనని భావోద్వేగం

Nandigam Suresh Released From Jail Vows Loyalty to Jagan
  • గుంటూరు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన నందిగం సురేశ్
  • టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ
  • చనిపోయేంత వరకు జగనన్నతోనే ఉంటానని భావోద్వేగం
వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. టీడీపీ కార్యకర్త రాజుపై దాడికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆయనకు సోమవారం గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, పూచీకత్తు పత్రాలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఆయన విడుదల రెండు రోజులు ఆలస్యమైంది. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం సురేశ్, అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

జైలు నుంచి విడుదలయ్యాక నందిగం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. "నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా నన్ను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు. కానీ పైన ఉన్న దేవుడు అన్నీ గమనిస్తున్నాడు" అని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిస్తూ, "నాకు ఉన్న ఒకే ఒక్క కోరిక.. చనిపోయేంత వరకు జగనన్నతోనే ఉండాలి. ఆయన మనిషిగానే నేను చనిపోతా. ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా, నష్టాలు కలిగించినా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటాను" అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పాలనను పక్కనపెట్టి, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు.

సురేష్‌శ్ ను రాజకీయంగా వేధిస్తున్నారు: అంబటి రాంబాబు

నందిగం సురేష్‌శ్ కు స్వాగతం పలికేందుకు జైలు వద్దకు వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు, లోకేశ్ లు నందిగం సురేశ్ పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని ఆరోపించారు. "ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో సగం రోజులు సురేశ్ జైలులోనే గడిపారు. ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయన్ను రెండుసార్లు జైలుకు పంపారు. చంద్రబాబు సుపరిపాలనకు ఇదే నిదర్శనం" అని అంబటి ఎద్దేవా చేశారు. తాను గత 14 నెలల్లో 14 సార్లకు పైగా తమ పార్టీ నేతలను పరామర్శించేందుకు గుంటూరు జైలుకు వచ్చానని, తన రాజకీయ జీవితంలో ఇంతటి కక్షపూరిత ప్రభుత్వాన్ని చూడలేదని అన్నారు.

తమ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో తప్పుడు కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. "మొదట నందిగం సురేశ్ భార్య ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కేసు తీసుకోలేదు. కానీ, ఎదుటివారు ఫిర్యాదు చేయగానే సురేశ్, ఆయన భార్య, సోదరుడిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి అక్రమ కేసులకు మేం భయపడే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీని అణచివేయాలనే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అక్రమ కేసులపై న్యాయపరంగా, రాజకీయంగా గట్టిగా పోరాడతామని వైసీపీ నేతలు తేల్చిచెప్పారు. 
Nandigam Suresh
YSRCP
Ambati Rambabu
Guntur Jail
Chandrababu Naidu
TDP
Political Vendetta
Andhra Pradesh Politics
Pinelli Ramakrishna Reddy
False Cases

More Telugu News