Ajith Kumar: హంతకులు కూడా ఇలా కొట్టరు.. కస్టడీ మరణంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

Madras High Court Outraged Over Custodial Death
  • తమిళనాడులో పోలీసుల చిత్రహింసలకు సెక్యూరిటీ గార్డు మృతి
  • ఐదుగురు పోలీసుల అరెస్ట్, సీబీఐకి కేసు బదిలీ
  • సెక్యూరిటీ గార్డు కస్టడీ మృతిపై తమిళనాడులో తీవ్ర దుమారం
  • పోలీసులపై తీవ్రంగా మండిపడ్డ న్యాయస్థానం
తమిళనాడు ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న కస్టోడియల్ డెత్ కేసుపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కస్టడీలో ఉన్న వ్యక్తి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. చివరికి హంతకులు కూడా ఈ స్థాయిలో దాడి చేయరంటూ పోలీసులపై మండిపడింది. ఈ ఘటనపై విచారణ జరిపి జులై 8 నాటికి నివేదిక ఇవ్వాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. సాక్ష్యాలన్నింటినీ దర్యాప్తు బృందానికి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని శివగంగ జిల్లాలో అజిత్ కుమార్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అజిత్ ను ప్రశ్నించారు. పోలీసుల కస్టడీలో అజిత్ మృత్యువాత పడ్డాడు. పోలీసులు హింసించడం వల్లే అజిత్ చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక కూడా అజిత్ పై చిత్రహింసలు నిజమేనని తేల్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా స్పందించారు.

అజిత్ మరణానికి కారణమైన ఐదుగురు పోలీసులను ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీని 'కంపల్సరీ వెయిట్'కు పంపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ మృతుడి తల్లి, సోదరుడితో ఫోన్‌లో మాట్లాడి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. "ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం. కొద్దిమంది సిబ్బంది చేసే పనులకు క్షమాపణ లేదు," అని ఆయన హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
Ajith Kumar
custodial death
Madras High Court
Tamil Nadu
police brutality
MK Stalin
Sivaganga district
CBI investigation
police arrest
crime

More Telugu News