GST reduction: జీఎస్టీ తగ్గింపు ఆలోచనలో కేంద్రం.. భారీగా తగ్గనున్న ధరలు

GST Reduction on Essential Items Likely Prices to Fall
  • మధ్యతరగతికి త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్ర ప్రభుత్వం
  • వంట సామాగ్రి, బట్టలు, టూత్‌పేస్ట్, కుక్కర్లు, బట్టలు వంటివి చౌకగా మారే ఛాన్స్
  • 12% జీఎస్టీ శ్లాబును రద్దు చేసేందుకు యత్నం.. కొన్ని రాష్ట్రాల అభ్యంతరం
  • త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం
ఆదాయపన్నులో రాయితీలతో వేతన జీవులకు కొంత ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మధ్యతరగతి, పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నిత్యావసర వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించడం లేదా ఈ శ్లాబ్ లోని పలు వస్తువులను 5 శాతం శ్లాబులోకి మార్చడం వంటి ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల భారం పడొచ్చని అంచనా. అయినప్పటికీ, ధరలు తగ్గితే వినియోగం పెరిగి, దీర్ఘకాలంలో పన్ను వసూళ్లు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇటీవల పరోక్షంగా సంకేతాలిచ్చారు.

ఈ నిర్ణయం అమలైతే టూత్‌పేస్ట్, కుక్కర్లు, గీజర్లు, సైకిళ్లు, రూ. 1000 పైబడిన రెడీమేడ్ దుస్తులు, రూ. 500-1000 మధ్య ధర ఉండే పాదరక్షలు వంటి అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయి. అయితే, ఈ ప్రతిపాదనకు పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీకి సంబంధించిన ఏ మార్పులకైనా జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి.

ఈ నెలాఖరులో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కౌన్సిల్‌లో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితేనే సామాన్యుడికి ఈ ఊరట దక్కనుంది.
GST reduction
GST council
price reduction
Nirmala Sitharaman
essential commodities
tax slab
consumer spending
indian economy
goods and services tax
tax revenue

More Telugu News