Harish Rao: చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉంది: హరీశ్ రావు

Harish Rao Alleges Secret Deal Between Chandrababu and Revanth
  • చంద్రబాబుకు రేవంత్ బ్యాగ్ మ్యాన్ గా మారారన్న హరీశ్
  • తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా బనకచర్లకు మద్దతిస్తున్నారని విమర్శ
  • రేవంత్ కు బేసిన్ల గురించి తెలియదని ఎద్దేవా
ఏపీ సీఎం చంద్రబాబు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'బ్యాగ్ మ్యాన్‌'గా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రాష్ట్ర హక్కులు, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం కేవలం తన రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి భవన్‌లో నీటిపారుదల శాఖపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రజెంటేషన్ చూస్తే హైదరాబాద్‌లో కాకుండా అమరావతిలో ఇచ్చినట్లుందని, దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తయారు చేసిందనే అనుమానం కలుగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బనకచర్ల ప్రాజెక్టును ఏపీ సీఎం ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో, ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ ప్రజెంటేషన్‌లో ఉద్దేశపూర్వకంగానే చూపించలేదని ఆరోపించారు. "బనకచర్ల కట్టే చంద్రబాబు రేవంత్‌కు దేవుడిలా కనిపిస్తున్నారు. అదే బనకచర్లను ఆపాలని పోరాడుతున్న బీఆర్ఎస్ మాత్రం చచ్చిన పాములా కనిపిస్తోంది" అని హరీశ్ రావు అన్నారు.

బీఆర్ఎస్‌ను చచ్చిన పాముతో పోల్చడంపై హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నిజంగానే చచ్చిన పాము అయితే, కాంగ్రెస్ నేతలు నిద్రలో కూడా దాని గురించే ఎందుకు కలవరిస్తున్నారని ప్రశ్నించారు. పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ కూడా చచ్చిన పామేనా? అని ఆయన నిలదీశారు. టెక్నికల్‌గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా, ఆయన మనసంతా ఏపీ వైపే ఉందనే విషయం రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు.

బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య తెరవెనుక ఒప్పందాలు జరిగాయని హరీశ్ రావు ఆరోపించారు. 2024లో ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారని అన్నారు. దీనికి కొనసాగింపుగా, 2024 నవంబర్ 15న, ఆ తర్వాత డిసెంబర్‌లోనూ ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖలు రాశారని, ఈ లేఖలన్నీ బయటకు వచ్చినా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు.

ఈ కుట్రను తాను ఈ ఏడాది జనవరి 24న ప్రెస్ మీట్‌లో బయటపెట్టానని, ఆ తర్వాతే తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతకు ముందు తేదీ వేసి కేంద్రానికి లేఖ రాశారని హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన పోరాటం వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) ప్రక్రియ తాత్కాలికంగా ఆగిందని, ఇది తమ పోరాట ఫలితమేనని స్పష్టం చేశారు. అపెక్స్ కమిటీ సమావేశంలో బనకచర్ల అంశం చర్చకు రాలేదని, కేవలం సముద్రంలోకి వృథాగా పోతున్న 3 వేల టీఎంసీల నీటిపై ఇరు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకోవాలని మాత్రమే నిర్ణయించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి నదీ బేసిన్లపై కనీస అవగాహన లేదని, అహంకారంతో మాట్లాడితే ప్రజలు అధఃపాతాళానికి తొక్కడం ఖాయమని హెచ్చరించారు.
Harish Rao
Revanth Reddy
Chandrababu Naidu
Telangana Politics
AP Politics
Banakacherla Project
BRS
Congress
Telangana
Andhra Pradesh

More Telugu News