Revanth Reddy: చంద్రబాబును కాపాడాలి.. కేసీఆర్ ను తిట్టాలి.. ఇదే రేవంత్ రెడ్డి పని: గంగుల

Revanth Reddy Focuses on Attacking KCR and Saving Chandrababu Says Gangula
  • కేసీఆర్ ను తిట్టడమే రేవంత్ లక్ష్యమన్న గంగుల
  • బనకచర్లపై పాత పాటే పాడారని ఎద్దేవా
  • కేసీఆర్ గోదావరి జలాలు వాడుకోమని చెప్పడం బనకచర్లకు అనుమతి ఇచ్చినట్టు ఎలా అవుతుందని ప్రశ్న
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ) ఒక ప్రహసనమని, అందులో కొత్తదనం ఏమీ లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిందించడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కాపాడటమే రేవంత్ పని అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బనకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తుందని ఆశిస్తే, అందుకు భిన్నంగా పాత పాటనే పాడారని గంగుల ఎద్దేవా చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు వాస్తవాలను బయటపెట్టి, ప్రభుత్వాన్ని నిద్రలేపారని అన్నారు. అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం లేఖ రాయడంతోనే సరిపెట్టారని, సమస్య తీవ్రతను కేంద్రానికి వివరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. "ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదు. ఎంతసేపూ రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడటం తప్ప రేవంత్, ఉత్తమ్‌లకు విషయంపై పట్టు లేదు" అని గంగుల వ్యాఖ్యానించారు. కేసీఆర్ గోదావరి జలాలు వాడుకోమని చెప్పడం బనకచర్లకు అనుమతి ఇచ్చినట్టు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

బనకచర్ల అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, "వచ్చే సోమవారమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. మా తరఫున హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి లేదా మరెవరైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి" అని సవాల్ విసిరారు. బనకచర్లకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించడం బీఆర్ఎస్ సాధించిన విజయమని, ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయే వరకు తమ పోరాటం కొనసాగుతుందని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టాలని రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవని పేర్కొన్నారు.

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి బనకచర్ల ప్రాజెక్టు కన్నా కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకోవడమే ముఖ్యమైందని అన్నారు. గోదావరి ట్రిబ్యునల్ ద్వారా ఏపీకి అదనపు నీటి కేటాయింపులు సాధించుకునేందుకే చంద్రబాబు బనకచర్ల పథకానికి రూపకల్పన చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడం లేదని ఆయన నిలదీశారు. ఈ సమావేశంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డాక్టర్ కె. సంజయ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ తదితరులు పాల్గొన్నారు. 
Revanth Reddy
Telangana
KCR
Chandrababu Naidu
Banakacherla Project
BRS
Uttam Kumar Reddy
Harish Rao
Telangana Assembly

More Telugu News