Teacher Sexual Assault: మైనర్ విద్యార్థిపై మహిళా టీచర్ లైంగిక వేధింపులు.. ముంబైలో ఘటన

Mumbai Teacher Arrested for Sexually Assaulting Minor Student
  • స్కూలు వదిలినా వేధింపులు ఆపని ఉపాధ్యాయురాలు
  • విద్యార్థి స్నేహితురాలితో రాయబారం చేసి ఒప్పించిన వైనం
  • పోక్సో కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు
దేశ ఆర్థిక రాజధానిలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు మైనర్ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. నలభై ఏళ్ల వయసున్న ఆ టీచర్ పదహారేళ్ల బాలుడిపై ఈ అమానుషానికి పాల్పడింది. బాలుడి స్నేహితురాలితో రాయబారం నడిపి, తనతో సన్నిహితంగా మెలిగేలా ప్రోత్సహించింది. హోటళ్లు, పబ్ లకు తీసుకెళ్లి మద్యం తాగించి సన్నిహితంగా మెలిగింది. ఈ ఘటన తర్వాత బాలుడు యాంగ్జైటీతో బాధపడగా.. ఉపాధ్యాయురాలు తనకొచ్చిన సొంత వైద్యం చేసింది. యాంగ్జైటీ తగ్గేందుకు టాబ్లెట్లు ఇచ్చింది. బాలుడి ప్రవర్తనలో మార్పు గమనించి కుటుంబ సభ్యులు నిలదీయడంతో టీచర్ నిర్వాకాన్ని బాలుడు బయటపెట్టాడు.

అయితే, కొన్ని రోజులు గడిస్తే చదువు పూర్తవుతుంది, టీచర్ వేధింపులు తప్పుతాయని ఆలోచనతో బాలుడి తల్లిదండ్రులు విషయాన్ని బయటపెట్టలేదు. చదువు పూర్తిచేసుకుని ఆ స్కూలు నుంచి బయటకు వచ్చేసినా ఆ టీచర్ వేధింపులు ఆగకపోవడం, ఇంట్లో పనిమనిషితో రాయబారం పంపడంతో బాధితుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆ టీచర్ కు వివాహం జరిగిందని, పిల్లలు కూడా ఉన్నారని బాలుడి పేరెంట్స్ చెప్పారు. వారి ఫిర్యాదుతో పోలీసులు సదరు టీచర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

బాధితుడు పదకొండో తరగతి చదువుతున్నప్పటి నుంచే ఉపాధ్యాయురాలి వేధింపులు మొదలయ్యాయని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచే బాలుడితో అసభ్యకరంగా ప్రవర్తించేదని, పలు సందర్భాల్లో లైంగిక సంబంధం కోసం సైగలు చేసిందని వివరించారు. 12 వ తరగతిలోకి వచ్చాక బాలుడు తనను దూరం పెడుతుండడంతో ఉపాధ్యాయురాలు మరో పన్నాగం పన్నిందన్నారు. తనతో సన్నిహితంగా మెలగాలని నిందితురాలి స్నేహితురాలితో చెప్పించిందన్నారు.

ఇటీవలి కాలంలో పెద్ద వయసు మహిళలతో బాలుర రిలేషన్ షిప్ సాధారణంగా మారిందని, మీరిద్దరూ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని స్నేహితురాలు ప్రోత్సహించడంతో బాలుడు కూడా టీచర్ కు దగ్గరయ్యాడని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి టీచర్ తో పాటు ఆమెకు సహకరించిన బాలుడి స్నేహితురాలిపైనా కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Teacher Sexual Assault
POCSO Act
Mumbai Teacher
Mumbai
Sexual Harassment
Crime News
India News
Student Harassment
Anxiety

More Telugu News