Siddaramaiah: ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి అన్న సిద్ధరామయ్య... మద్దతివ్వడం తప్ప మార్గం లేదన్న డీకే శివకుమార్

Siddaramaiah Confirms Full Term as Karnataka Chief Minister
  • కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలకు తెర
  • ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టీకరణ
  • ప్రతిపక్షాల వ్యాఖ్యలను కొట్టిపారేసిన కర్ణాటక ముఖ్యమంత్రి
  • సిద్ధరామయ్యకు మద్దతివ్వడం తప్ప మరో మార్గం లేదన్న డీకే శివకుమార్
  • అధిష్ఠానం ఆదేశాలను పాటిస్తానని వ్యాఖ్య
కర్ణాటక రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నాయకత్వ మార్పు అంశానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా తెరదించారు. ఐదేళ్ల పూర్తి కాలం తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన బుధవారం స్పష్టంగా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమంటూ సాగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడినట్లయింది.

బుధవారం మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి మార్పు గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. "ఐదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. ఈ విషయంలో మీకెందుకు అనుమానాలు వస్తున్నాయి?" అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని మారుస్తారంటూ బీజేపీ, జేడీఎస్ వంటి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. "వారు కాంగ్రెస్ అధిష్ఠానమా? మా పార్టీ అంతర్గత విషయాల గురించి మాట్లాడటానికి వాళ్లెవరు?" అని ఆయన కొట్టిపారేశారు.

అదిష్ఠానం ఏది చెబితే అది చేయడమే నా కర్తవ్యం: డీకే శివకుమార్

ఈ పరిణామాలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా స్పందించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. "ఆయనకు అండగా నిలవడం తప్ప నాకు మరో దారి లేదు. నేను ఆయనకు మద్దతు ఇవ్వాలి. పార్టీ అధిష్ఠానం ఏది చెబితే అది చేయడమే నా కర్తవ్యం" అని శివకుమార్ పేర్కొన్నారు.

ఇటీవల కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలే ఈ నాయకత్వ మార్పు చర్చకు ఆజ్యం పోశాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ, మరో రెండు, మూడు నెలల్లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని అన్నారు. పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో అందరికీ తెలుసని, అధిష్ఠానం కూడా శివకుమార్ గురించే ఆలోచిస్తోందని వ్యాఖ్యానించారు. దీనికి తోడు, మరో మంత్రి కే.ఎన్. రాజన్న సైతం సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని చెప్పడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
Siddaramaiah
Karnataka politics
DK Shivakumar
Chief Minister
Congress party
leadership change

More Telugu News