Nara Lokesh: కల్యాణి టీచర్ పాఠాలు... విద్యార్థిగా మారిన మంత్రి నారా లోకేశ్!

Nara Lokesh Becomes Student to Teacher Kalyani
  • ఆ సింగిల్ టీచర్ కృషికి మంత్రి లోకేశ్ ఫిదా
  • తన నివాసానికి ఆహ్వానించి అరుదైన సత్కారం!
  •  'షైనింగ్ టీచర్' పురస్కారం అందజేత
అది ఉండవల్లిలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నివాసం... కానీ, ఇవాళ ఒక తరగతి గదిలా మారిపోయింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ విద్యార్థిలా మారిపోగా... ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రభుత్వ బడుల బలోపేతంపై పాఠాలు చెప్పారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలో వివరించారు. ఈ అరుదైన, స్ఫూర్తిదాయక సన్నివేశం మంత్రి నారా లోకేశ్ నివాసంలో ఆవిష్కృతమైంది. మూసివేత దశలో ఉన్న పాఠశాల రూపురేఖలు మార్చి, తన అంకితభావంతో ఆదర్శంగా నిలిపిన కర్నూలు జిల్లా ఉపాధ్యాయురాలు ఎం. కల్యాణి కుమారిని మంత్రి లోకేశ్ అసాధారణ రీతిలో గౌరవించారు. ఆమెకు 'షైనింగ్ టీచర్' పురస్కారం అందజేశారు.

ఒంటి చేత్తో చరిత్ర.. స్ఫూర్తిదాయక ప్రస్థానం

కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం, జేఎం తండాలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. 2017లో కల్యాణి కుమారి అక్కడికి బదిలీపై వెళ్లేనాటికి, 14 మంది విద్యార్థుల నమోదు ఉంటే, బడికి వచ్చేది కేవలం ఇద్దరే. ఏ క్షణంలోనైనా మూతపడే ప్రమాదంలో ఉన్న ఆ బడిని ఆమె సవాలుగా స్వీకరించారు. సొంత ఖర్చులతో పాఠశాలకు రంగులు వేయించి, అదనపు స్టడీ మెటీరియల్ అందించి, ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు ప్రభుత్వ బడిపై నమ్మకం కలిగించారు. ఆమె నిరంతర కృషితో విద్యార్థుల సంఖ్య 53కి చేరింది. కేవలం సంఖ్య పెంచడమే కాదు, నాణ్యమైన విద్యను అందించి 23 మంది విద్యార్థులను గురుకుల పాఠశాలల్లో, ఒక విద్యార్థిని ప్రతిష్టాత్మక నవోదయ విద్యాలయంలో చేర్పించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

టీచర్‌కు విద్యార్థిగా మారిన లోకేశ్


కల్యాణి కుమారి కృషి గురించి తెలుసుకున్న మంత్రి లోకేశ్, ఆమెను కుటుంబంతో సహా ఉండవల్లిలోని తన నివాసానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. 'షైనింగ్ టీచర్' పురస్కారంతో ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ ఒక విద్యార్థిలా మారి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కల్యాణి కుమారి నుంచి ఎంతో ఓపికగా సలహాలు విన్నారు. ఆమె సూచనలను తప్పక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. "ఒక సింగిల్ టీచర్‌గా ఉండి, పాఠశాల రూపురేఖలు మార్చి, పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు తీసుకురావడం ఒక చరిత్ర. మీ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు" అంటూ ఆమెను ప్రశంసించారు.

ప్రభుత్వ బడుల బలోపేతానికి సూచనలు

ఈ సందర్భంగా కల్యాణి కుమారి మాట్లాడుతూ, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అదనంగా మరో ఉపాధ్యాయుడిని నియమిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని సూచించారు. తరచూ తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం, విద్యార్థులను ప్రోత్సహించేందుకు ‘స్టార్ ఆఫ్ ది వీక్’ వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తాను విజయం సాధించానని వివరించారు. ఆమె సూచనలను శ్రద్ధగా విన్న లోకేశ్, రాష్ట్రంలో 9,600 పాఠశాలలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని, ఈ విధానాన్ని మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలపైనే తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, డీఎస్సీ అడ్డంకులు తొలగించి నియామకాలు చేపడతామని భరోసా ఇచ్చారు.

కల్యాణి కుమారి వంటి ఎందరో అంకితభావం కలిగిన ఉపాధ్యాయులే ప్రభుత్వ విద్యా వ్యవస్థకు వెన్నెముక అని, వారిని కలిసి, వారి సలహాలు స్వీకరించి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తనను ఇంటికి పిలిచి గౌరవించడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని కల్యాణి కుమారి ఆనందం వ్యక్తం చేశారు.
Nara Lokesh
Kalyani Kumari
AP Education
Andhra Pradesh Education
Government Schools
Teacher Awards
Education Reform
Pattikonda
Kurnool District
Shining Teacher Award

More Telugu News