Pawan Kalyan: ఏపీలో లక్ష ఫామ్ పాండ్స్ నిర్మాణం పూర్తి.. రైతులకు అండగా నిలుస్తాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan One Lakh Farm Ponds Completed in AP
  • లక్ష వ్యవసాయ కుంటలను రైతులకు అందుబాటులోకి తెచ్చామన్న పవన్
  • రైతుల సహకారంతోనే ఇది సాధ్యమయిందని ప్రశంస
  • కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతోందని వ్యాఖ్య
రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఫామ్ పాండ్స్ (వ్యవసాయ కుంటలు) నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు.

ఈ వ్యవసాయ కుంటలు కరవు పరిస్థితుల్లో కూడా రైతులకు ఆసరాగా నిలుస్తాయని పవన్ పేర్కొన్నారు. వీటి నిర్మాణం ద్వారా నిస్సారమైన భూములకు సైతం జీవం పోయవచ్చని, భూగర్భ జలాల మట్టం పెరగడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ఈ ఫామ్ పాండ్స్ వల్ల ఇప్పటివరకు సుమారు 1 టీఎంసీ నీటిని నిల్వ చేసే సామర్థ్యం పెరిగిందని, అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ శ్రామికులకు పని కల్పించినట్టు అయిందని ఆయన తెలిపారు.

రైతుల సహకారంతోనే ఈ బృహత్కార్యం సాధ్యమైందని పవన్ అన్నారు. వ్యవసాయ కుంటల ఆవశ్యకతను గ్రహించి, తమ పొలాల్లో వాటిని తవ్వించుకోవడానికి ముందుకు వచ్చిన రైతులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, ఈ యజ్ఞంలో పాలుపంచుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి మొదలుకొని క్షేత్రస్థాయి సహాయకుల వరకు సిబ్బందికి, ఉపాధి హామీ కూలీలకు ఆయన పేరుపేరునా అభినందనలు తెలియజేశారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతోందని పవన్ పేర్కొన్నారు. ఇందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేశారు.
Pawan Kalyan
Andhra Pradesh
Farm Ponds
Agriculture
Rural Development
MGNREGA
Groundwater
Chandrababu Naidu
Shivraj Singh Chouhan
Farmers

More Telugu News