Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష

Sheikh Hasina Sentenced to Six Months in Jail
  • కోర్టు ధిక్కరణ కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పు
  • గతేడాది దేశం విడిచి వెళ్లిన తర్వాత హసీనాకు ఇదే తొలి శిక్ష
  • మానవ హననం కేసులోనూ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాకు కోర్టు ధిక్కరణ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసీటీ), బుధవారం ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దాదాపు ఏడాది క్రితం దేశంలో తీవ్ర నిరసనల మధ్య ఆమె ప్రభుత్వం కూలిపోయి, దేశం విడిచి వెళ్లిన తర్వాత ఒక కేసులో ఆమెకు శిక్ష పడటం ఇదే మొదటిసారి.

ఢాకా ట్రిబ్యూన్ పత్రిక కథనం ప్రకారం, జస్టిస్ ఎండీ గోలాం మొర్తజా మొజుందర్ నేతృత్వంలోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్-1కు చెందిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఇదే కేసులో సంబంధం ఉన్న గైబంధా ప్రాంతానికి చెందిన షకీల్ ఆకంద్ బుల్బుల్‌కు కూడా రెండు నెలల జైలు శిక్ష విధించినట్లు ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.

షేక్ హసీనా ప్రస్తుతం కేవలం కోర్టు ధిక్కరణ కేసులోనే కాకుండా, అంతకంటే తీవ్రమైన ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నారు. గత ఏడాది తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనల సమయంలో అమానవీయ రీతిలో నేరాలకు పాల్పడ్డారంటూ ఆమెపై అధికారికంగా అభియోగాలు నమోదయ్యాయి. నిరసనకారులపై షేక్ హసీనా 'పద్ధతి ప్రకారం దాడులు' చేయించారని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తాజుల్ ఇస్లాం ఆరోపించారు.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నివేదిక ప్రకారం, 2024 జూలై 15 నుంచి ఆగస్టు 15 మధ్య జరిగిన ఆ హింసాత్మక ఘటనల్లో సుమారు 1,400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. అయితే, తనపై మోపిన అన్ని ఆరోపణలను షేక్ హసీనా మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నారు. ఈ ఆరోపణలపై వాదనలు వినిపిస్తామని ఆమె తరఫు న్యాయవాది అమీర్ హుస్సేన్ మీడియాకు తెలిపారు. 2024 ఆగస్టులో దేశవ్యాప్త ఆందోళనలతో అవామీ లీగ్ ప్రభుత్వం అనూహ్యంగా కూలిపోవడంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచిపెట్టి భారతదేశానికి చేరుకున్నట్టు కథనాలు వచ్చాయి.
Sheikh Hasina
Bangladesh
Awami League
Court Contempt
International Crimes Tribunal

More Telugu News