Sigachi Industries: మృతులకు భారీ పరిహారాన్ని ప్రకటించిన పాశమైలారంలోని సిగాచి కంపెనీ

Sigachi Industries Announces Compensation for Pashamylaram Accident Victims
  • పాశమైలారం దుర్ఘటనపై ఎట్టకేలకు స్పందించిన సిగాచి యాజమాన్యం
  • మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటన
  • గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ బాధ్యత స్వీకరణ
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పెను విషాదాన్ని మిగిల్చిన సిగాచి పరిశ్రమ ప్రమాదంపై యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున భారీ పరిహారాన్ని ప్రకటించింది. గాయపడిన వారి పూర్తి వైద్య ఖర్చులతో పాటు వారి కుటుంబాల పోషణ బాధ్యతను కూడా తామే చూసుకుంటామని హామీ ఇచ్చింది.

ఈ మేరకు కంపెనీ సెక్రటరీ వివేక్, స్టాక్ మార్కెట్లకు ఓ లేఖ ద్వారా వివరాలను తెలియజేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారంతో పాటు, అన్ని రకాల బీమా క్లెయిమ్‌లను కూడా చెల్లిస్తామని ఆ ప్రకటనలో హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని, వారు కోలుకునే వరకు వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 40 మంది కార్మికులు మరణించారని, మరో 33 మంది గాయపడ్డారని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

పరిశ్రమలో ప్రమాదానికి రియాక్టర్ పేలుడే కారణమన్న ప్రచారాన్ని కంపెనీ తోసిపుచ్చింది. ప్రమాద కారణాలపై ప్రభుత్వ నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా పాశమైలారంలోని ప్లాంట్‌లో కార్యకలాపాలను మూడు నెలల పాటు నిలిపివేస్తున్నామని యాజమాన్యం వెల్లడించింది.
Sigachi Industries
Sangareddy
Pashamylaram
Sigachi factory accident
Andhra Pradesh
Factory explosion
Compensation
Industrial accident India
Telangana

More Telugu News