Mohammed Shami: షమీ ఓ క్రిమినల్... టీమిండియా పేసర్ పై భార్య తీవ్ర వ్యాఖ్యలు

Mohammed Shami Branded Criminal by Wife Hasin Jahan
  • భార్య హసీన్ జహాన్‌కు నెలకు రూ.4 లక్షల భరణం చెల్లించాలని షమీకి హైకోర్టు ఆదేశం
  • మీడియాతో మాట్లాడిన హసీన్ జహాన్
  • షమీ కారణంగా మోడలింగ్ కెరీర్ కోల్పోయానని వెల్లడి
  • తనను, తన కూతురిని పోషించాల్సిన బాధ్యత షమీదేనని స్పష్టీకరణ
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి తన భార్య హసీన్ జహాన్‌తో జరుగుతున్న న్యాయపోరాటంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. విడిగా ఉంటున్న తన భార్య హసీన్ జహాన్‌కు, వారి కుమార్తెకు కలిపి నెలకు రూ. 4 లక్షల మధ్యంతర భరణం చెల్లించాలని కలకత్తా హైకోర్టు షమీని ఆదేశించింది. కోర్టు తీర్పు అనంతరం హసీన్ జహాన్ మీడియాతో మాట్లాడారు.  

"పెళ్లికి ముందు నేను ఒక మోడల్‌ని, నటిని. నాకంటూ ఒక కెరీర్ ఉంది. కానీ అతని కోసం, అతనిపై ప్రేమతో వాటన్నింటినీ వదులుకున్నాను. నా వృత్తిని వదిలేయమని అతనే నన్ను బలవంతం చేశాడు. ఇప్పుడు నన్ను, నా కూతురిని పట్టించుకోకుండా వదిలేశాడు. అతడో క్రిమినల్!" అని వ్యాఖ్యానించారు.

"ఒక వ్యక్తి నేరస్తుడని, మన భవిష్యత్తుతో ఆడుకుంటాడని వారి ముఖం మీద రాసి ఉండదు కదా? నేను కూడా అలానే మోసపోయాను. షమీపై ప్రేమతో నా కెరీర్‌ను వదులుకున్నాను. ఇప్పుడు నాకు ఆదాయ మార్గం లేదు. నన్ను, నా కూతురిని పోషించాల్సిన బాధ్యత అతనిదే. అందుకే న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది" అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. "హసీన్ జహాన్ జీవితాన్ని నాశనం చేయాలనే తన పంతాన్ని షమీ ఇకనైనా వీడాలి. అతను నన్ను ఏమీ చేయలేడు, ఎందుకంటే నేను న్యాయం వైపు నిలబడ్డాను" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

గతంలో, 2023లో సెషన్స్ కోర్టు జహాన్‌కు రూ. 50,000, కుమార్తెకు రూ. 80,000 భరణంగా ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. అయితే, ఆ మొత్తం తమ జీవన ప్రమాణాలకు ఏమాత్రం సరిపోదని వాదిస్తూ జహాన్ హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె అంతర్జాతీయ పాఠశాలలో చదువుతోందని, అందుకు ఖర్చులు అధికంగా ఉంటాయని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా హైకోర్టు భరణం మొత్తాన్ని భారీగా పెంచుతూ ఇచ్చిన తీర్పు ఆమెకు పెద్ద ఊరటనిచ్చింది.
Mohammed Shami
Hasin Jahan
Indian Cricketer
Alimony Case
Kolkata High Court
Divorce Case
Cricket News
Maintenance
Domestic Dispute

More Telugu News