Sirish: రామ్ చరణ్ ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి... మరోసారి సారీ చెప్పిన శిరీష్... వీడియో రిలీజ్

Sirish Apologizes to Ram Charan Fans Again Releases Video
  • 'గేమ్ ఛేంజర్' సినిమాపై చేసిన వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం
  • చరణ్‌ను కించపరిచే ఉద్దేశం తనకు లేదని వీడియో ద్వారా స్పష్టం
  • స్నేహంతోనే మాట దొర్లిందని, కావాలని అనలేదని వివరణ
  • తమ సంస్థకు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉందని వెల్లడి
  • చరణ్‌తో త్వరలోనే మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటన
ప్రముఖ నిర్మాత శిరీష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు, ఆయన అభిమానులకు మరోసారి క్షమాపణలు తెలిపారు. ఇటీవల 'గేమ్ ఛేంజర్' సినిమా గురించి తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, శిరీష్ నిన్న ఓ లేఖలో క్షమాపణ చెప్పారు. తాజాగా, స్వయంగా ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. రామ్ చరణ్‌ను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, తమ మధ్య ఉన్న స్నేహంతో పొరపాటున మాట దొర్లిందని స్పష్టం చేశారు.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రామ్ చరణ్ హీరోగా 'గేమ్ ఛేంజర్' సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితం గురించి ఇటీవల శిరీష్ మాట్లాడుతూ.. హీరో, దర్శకుడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రామ్ చరణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, శిరీష్ మొదట ఓ లేఖను, తాజాగా ఓ వీడియోను విడుదల చేసి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ, "చిరంజీవి గారికి, రామ్ చరణ్‌కు, మా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకు మధ్య విడదీయరాని బంధం ఉంది. నేను ఎంతో అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ వదులుకోవాలనుకోను. అభిమానుల బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నేను ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు అనలేదు" అని తెలిపారు.

"అది నా తొలి ఇంటర్వ్యూ కావడంతో అలా మాట దొర్లిందేమో. మెగా హీరోలైన వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్‌లతో కూడా మేం సినిమాలు నిర్మించాం. చిరంజీవి గారు నాతో, దిల్ రాజుతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. అంతటి అనుబంధం ఉన్న వారిని అవమానించేంత మూర్ఖుడిని కాదు. సంక్రాంతికి మా సినిమా విడుదల చేయొద్దని చరణ్ ఒక్క మాట చెప్పి ఉంటే ఆగిపోయేది. కానీ ఆయన మంచి మనసుతో మా గురించి ఆలోచించారు. అలాంటి వ్యక్తిని మేమెందుకు అవమానిస్తాం? త్వరలోనే ఆయనతో మరో సినిమా కూడా చేయబోతున్నాం. అభిమానులు దయచేసి అర్థం చేసుకోవాలి" అని శిరీష్ విజ్ఞప్తి చేశారు.
Sirish
Ram Charan
Game Changer
Sri Venkateswara Creations
Dil Raju
Chiranjeevi
Telugu Cinema
Varun Tej
Sai Durga Tej
Movie Release

More Telugu News