Ajay Kumar: పొరుగు దేశం జాబితాలో సిక్కింను పేర్కొన్న కాంగ్రెస్ నేత.. బీజేపీ, సిక్కిం అధికార పార్టీ ఆగ్రహం

Ajay Kumar Calls Sikkim Neighboring Country Sparks Outrage
  • సిక్కింను పొరుగు దేశంగా పేర్కొన్న కాంగ్రెస్ నేత అజయ్ కుమార్
  • విదేశాంగ విధానంపై మాట్లాడుతున్నప్పుడు నోరు జారిన వైనం
  • వివాదంతో వెనక్కి తగ్గిన నేత.. పొరపాటంటూ క్షమాపణ
  • కాంగ్రెస్ తీరుపై బీజేపీ, సిక్కిం అధికార పార్టీ ఎస్కేఎం ఫైర్
  • ఇది సిక్కిం ప్రజలను అవమానించడమేనన్న ఎస్కేఎం
  • అజయ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌కు డిమాండ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జంషెడ్‌పూర్ మాజీ ఎంపీ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సిక్కింను పొరుగు దేశంగా పేర్కొనడం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు సిక్కిం అధికార పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) తీవ్రంగా మండిపడ్డాయి.

అసలేం జరిగింది?

మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ అజయ్ కుమార్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై విమర్శలు చేశారు. పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక పేర్లను ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆయన పొరపాటున సిక్కిం పేరును కూడా ఆ జాబితాలో చేర్చారు. భారత్‌లో విలీనమై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సిక్కింపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

వివాదం ముదరడంతో అజయ్ కుమార్ బుధవారం 'ఎక్స్' ద్వారా క్షమాపణ చెప్పారు. "సెయిల్ స్కామ్‌పై నిన్న ప్రెస్ మీట్‌లో పొరుగు దేశాలతో సంబంధాల గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను అనుకోకుండా ఒక రాష్ట్రం పేరు చెప్పాను. అది కేవలం నోరు జారడం వల్ల జరిగిన చిన్న పొరపాటు. దీనికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

బీజేపీ, ఎస్కేఎం ఫైర్

అజయ్ కుమార్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది సిక్కింతో పాటు మొత్తం ఈశాన్య భారత ప్రజలను అవమానించడమేనని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. కాంగ్రెస్ ఒక 'జిన్నావాదీ పార్టీ' అని, దేశాన్ని విభజించాలని చూస్తోందని ఆయన విమర్శించారు.

మరోవైపు, సిక్కిం అధికార పార్టీ ఎస్కేఎం కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక జాతీయ పార్టీ నేతకు దేశ భౌగోళిక, చారిత్రక అంశాలపై కనీస అవగాహన లేకపోవడం దారుణమని ముఖ్యమంత్రి ప్రేమ సింగ్ తమాంగ్ ప్రెస్ సెక్రటరీ యుగన్ తమాంగ్ అన్నారు. ఇది సిక్కిం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని, అజయ్ కుమార్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Ajay Kumar
Sikkim
Indian Politics
Congress Party
BJP
SKM
India Foreign Policy

More Telugu News